ఆ వెలుగు జిలుగులు జీవితంలో మిస్ అయ్యాయి. కళ్ళు మిరుమిట్లు గొలిపే వేదికపై డాన్స్ వేయటం..వేయించే ఛాన్స్ అంటే అందరికి రాదు. ఆ డాన్స్ కార్యక్రమం కూడా ఒక ప్రముఖ ఛానల్ ప్రసారం కావటం అంటే అది ఒక విజయం కిందే లెక్క. ఈటీవీ లో ఢీ కార్యక్రమం చూసే ప్రతి ఒక్కరికి కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్ గురించి తెలుసు. అయన కొరియోగ్రఫీ తో పాటు వ్యక్తిగతంగా కూడా ఫ్లోర్ లో అంతే సరదాగా ఉండటమే కాదు..అందరిలో జోష్ తెచ్చే ప్రయత్నం చేస్తారు. అంతటి సరదా మనిషి అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవటం కలకలం రేపుతోంది. ఆత్మహత్యకు కారణాలు చెపుతూ అయన ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఇది ఇప్పుడు పెద్ద సంచనలనంగా మారింది. ఇందులో చైతన్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఢీ కార్యక్రమంతో పేరు, ప్రఖ్యాతులు వచ్చినా ఇందులో డబ్బు చాలా తక్కువగా వస్తుంది అని తెలిపారు. ఢీ కంటే జబర్దస్త్ లో ఉండే వాళ్ళకే డబ్బులు ఎక్కువ వస్తాయని వెల్లడించారు. తాను అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటున్నానని..అందుకు కుటుంబ సభ్యులతో పాటు ఎంతో మందికి క్షమాపణ చెప్ప్పారు ఆ వీడియోలో.
నాలుగున్నరేళ్లగా ఢీ షోలో డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేస్తున్న ఆయన శనివారం నెల్లూరులో కళాంజలి సాంస్కృతిక సంస్థ నిర్వహించిన ప్రపంచ నృత్య దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని అవార్డు అందుకొన్నారు. తర్వాత నెల్లూరు క్లబ్ హోటల్‌లో రూమ్ తీసుకున్నారు. ఆదివారం ఉదయం ఎంత సేపటికి తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది దర్గామిట్ట పోలీసులకు సమాచారం అందించారు. హాటల్‌కు చేరుకున్న పోలీసులు గది కిటికీలో నుంచి చూడగా చైతన్య ఫ్యానుకు వేలాడుతూ కన్పించారు. తలుపులు పగలగొట్టి చూడగా చైతన్య మృతి చెందారు. ధనలక్ష్మిపురంలో ఉంటున్న చైతన్య మేనమామ మాల్యాద్రి ఫిర్యాదు మేరకు దర్గామిట్ట పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ‘‘ఒక అప్పును పూడ్చుకునేందుకు.. మరో తప్పు.. అలా అప్పులు పెరిగిపోయాయి. నేమ్, ఫేమ్ ఇచ్చిన ‘ఢీ’ షోకు రుణపడి ఉంటానని అన్నారు. నెల్లూరు జిల్లా కావలి మండలం, మట్టువారిపాలెం.. చైతన్య స్వస్థలం. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి డాన్స్ రంగం వైపు వచ్చాడు. తమతో ముందుగా అప్పుల విషయం ఒక్క మాట చెప్పి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అని అయన స్నేహితులు, సహచరులు వ్యాఖ్యానిస్తున్నారు.