మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలకు సంబంధించి సాగుతున్న రగడపై చిరంజీవి స్పందించారు. ఎన్నికలు వెంటనే జరపాలని, ఆలస్యమైతే సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతాయన్నారు. అదే సమయంలో 'మా' ప్రతిష్ట దెబ్బతీస్తున్న ఎవరినీ ఉపేక్షించవద్దంటూ 'మా' క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణం రాజుకు చిరంజీవి లేఖ రాశారు. సభ్యుల బహిరంగ ప్రకటనలతో 'మా' ప్రతిష్ట మసకబారుతుందన్నారు. తాజాగా మా ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్‌పై నటి హేమ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మాలో ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెడుతున్నారంటూ ఆమె విమర్శలు గుప్పించారు.
ఎన్నికలు పెట్టకుండా ఆ పదవిలో కొనసాగేందుకు నరేష్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆ తర్వాత నరేష్ మాట్లాడుతూ ఆమెపై చర్యలు తప్పవన్నారు. కరోనా పరిస్థితిని మదింపు చేసి ఆ ప్రకారమే ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం టాలీవుడ్ లో మా ఎన్నికలు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ సారి ఎక్కువ మంది బరిలోకి దిగేందుకు ఆసక్తిచూపిస్తుండటంతో మా రాజకీయం ఆసక్తికరంగా మారింది.