Full Viewజూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా బ్రహ్మస్త్ర చిత్ర యూనిట్ శుక్రవారం రాత్రి హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తలపెట్టిన విషయం తెలిసిందే. కానీ చివరి నిమిషంలో ఈ ఈవెంట్ రద్దు కావటంతో చిత్ర యూనిట్ షాక్ కు గురైంది. అప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీకి భారీ ఎత్తున ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేరుకున్నారు..ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముంబయ్ నుంచి హీరో రణబీర్ కపూర్, హీరోయిన్ అలియాభట్ తోపాటు మరికొంత మంది కూడా వచ్చారు. కానీ ఊహించని పరిణామంతో వీరంతా ఓ హోటల్ లో ప్రెస్ మీట్ తో సరిపెట్టాల్సి వచ్చింది. అయితే ఈ కార్యక్రమం రద్దు కారణంగా చిత్ర యూనిట్ కు ఏకంగా 1.5 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఫిల్మ్ సిటీలో భారీ ఏర్పాట్లు చేశామని ప్రముఖ దర్శకుడు రాజమౌళి మీడియా సమావేశంలో వెల్లడించారు.
ప్రత్యేక ప్రదర్శనల కోసం కూడా భారీ ఏర్పాట్లు చేశామని..పోలీసు ఉన్నతాధికారులు చేసిన సూచనలను కూడా అమలు చేశామన్నారు. అయినా సరే చివరి నిమిషంలో ఈవెంట్ రద్దు అయింది. కొద్ది రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కలవటం..రాజమౌళి తండ్రి. రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ బిజెపి కోసం రాజకీయంగా కొన్ని సినిమాలకు కధలు సిద్ధం చేస్తుండటంతోనే ఆగ్రహంతో కెసీఆర్ సర్కారు అటు ఎన్టీఆర్, ఇటు రాజమౌళికి ఒకేసారి ఝలక్ ఇచ్చినట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. సినీ పరిశ్రమలోని వారు తమన దెబ్బతీసేలా రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందో చూపింటానికే ఇలా చేశారనే చర్చ సాగుతోంది.