Full Viewపవర్ ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానాలు నటించిన 'భీమ్లానాయక్' ట్రైలర్ ను చిత్ర యూనిట్ సోమవారం రాత్రి విడుదల చేసింది. 'ఏంటి బాలాజీ స్పీడ్ పెంచావు. ఇది పులులు తిరిగే ప్రాంతం అంట బాబూ. పులి పెగ్గేసి పడుకుంది కానీ నువుస్లోగానే పోనీ' అనే రానా డైలాగ్ తో ఈ ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. నేను ఇవతల ఉంటేనే చట్టం. అవతల కొస్తే కష్టం. వాడికి. అంటూ పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్ తో ముగుస్తుంది. వాస్తవానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి..ట్రైలర్ విడుదల చేయాల్సి ఉన్నా..ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి హఠాన్మరణంతో ఈ కార్యక్రమాన్ని రద్దు చేసి..ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే.
సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించింది. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు సహకారం అందించారు. మళయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియంకు ఇది రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో నిత్యామీనన్, సంయుక్తా మీనన్ లు సందడి చేయనున్నారు. తొలుత సోమవారం రాత్రి 8,10 గంటలకు ట్రైలర్ విడుదల చేస్తామని ప్రకటించిన చిత్ర యూనిట్ చెప్పిన దాని కంటే మరింత ఆలశ్యంగా తొమ్మిది గంటలకు ట్రైలర్ ను విడుదల చేసింది. భీమ్లానాయక్ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచిందనే చెప్పాలి.