Full Viewప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే. రాధేశ్యామ్ తర్వాత వస్తున్న సినిమా ఆదిపురుష్. ఈ సినిమాకు సంబంధించి టీజర్ ను చిత్ర యూనిట్ ఆదివారం సాయంత్రం విడుదల చేసింది. ఈ టీజర్ సినిమాపై అంచనాలను ఓ రేంజ్ కు తీసుకెళ్లిందనే చెప్పొచ్చు. విజువల్ వండర్ గా టీజర్ ప్రభాస్ అభిమానులే కాకుండా..సినీ అభిమానులను కూడా ఆకట్టుకుంటుందనంలో ఎలాంటి సందేహం లేదు. నీళ్లలో తపస్సు చేస్తూ రాముడిగా కన్పించే ప్రభాస్ ఆకట్టుకుంటాడు. న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం..వస్తున్నా..పది తలల అన్యాయాన్ని అణచివేయటానికి అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ లు కూడా ఇందులో హైలెట్ గా నిలిచాయి.
రావణుడిగా సైఫ్ ఆలీ ఖాన్ నటిస్తుంటే.. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా కృతి సనన్ నటిస్తోంది. టీజర్ లో వీళ్ల లుక్స్ కూడా అదిరిపోయేలా ఉన్నాయి. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి అంటే జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. టీజర్ చూస్తే ఇప్పటి వరకూ చూసిన సినిమాలను తలదన్నేరీతిలో సన్నివేశాలు కన్పిస్తున్నాయి. చూస్తుంటే ఈ సినిమా ప్రభాస్ రేంజ్ ను మరింత ఎత్తుకు తీసుకెళ్ళటం ఖాయంగా కన్పిస్తోంది. ఆదివారం నాడు అయోధ్యలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి మరీ ఈ టీజర్ విడుదల చేశారు.