ఎన్ సీబీ సీరియస్ గా తీసుకుంటే చాలా మంది వస్తారంటున్న పరిశ్రమ వర్గాలు
ఆ ఫోన్ కాల్ వెనక ఏముంది?. ఆ డ్రగ్స్ జాబితాలో ఎవరెవరు ఉన్నారు?. ఇదీ ఇప్పుడు టాలీవుడ్ లో కొత్తగా కలకలం రేపుతున్న అంశం. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు ముందు రియా చక్రవర్తి టాలీవుడ్ కు చెందిన ప్రముఖ సినీ కుటుంబానికి చెందిన వ్యక్తితో ఫోన్ లో మాట్లాడింది. 2012 సంవత్సరంలో తూనీగ తూనీగ అనే తెలుగు సినిమాలో నటించింది రియా చక్రవర్తి. అప్పటి నుంచి కొత్త సినిమాలు ఏమీ చేయకుండానే టాలీవుడ్ లో కీలక ఫ్యామిలీకి చెందిన వ్యక్తులతో మాట్లాడాల్సిన అవసరం ఏమి వచ్చింది?. ఏ అంశంలో ఆమె ఆ వ్యక్తితో మాట్లాడింది. ఈ వ్యవహారమే టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన తరుణంలో టాలీవుడ్ కు చెందిన రకుల్ ప్రీత్ సింగ్ పేరును రియా చక్రవర్తి డ్రగ్స్ వాడిన వారి జాబితాలో చెప్పటంతో ఇప్పుడు కొత్త కలకలం మొదలైంది. రియా చక్రవర్తి, ఆమె సోదరుడు డీలర్ ల నుంచి డ్రగ్స్ తీసుకున్నట్లు ఎన్ సీబీ అధికారులు గుర్తించారు.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కోసమే ఇవి తీసుకున్నట్లు వీరు చెబుతున్నారు. కొత్తగా రకుల్ ప్రీత్ సింగ్ పేరు రావటం..ఎన్ సీబీ ఎంట్రీతో వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో అన్న టెన్షన్ టాలీవుడ్ వర్గాల్లో నెలకొంది. టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారాన్ని ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ ఇప్పటికే అటకెక్కించినట్లే కన్పిస్తోంది. దీనికి కారణం ఇప్పటివరకూ ఎవరిపై ఎలాంటి చర్యలు లేవు. తాజా పరిణామాలను బట్టి చూస్తుంటే రియా చక్రవర్తి తెలుగులో గత కొన్నేళ్ళుగా సినిమాలు ఏమీ చేయకపోయినా ఇక్కడికి చెందిన హీరోలు..రకుల్ వంటి వారితో సత్సంబంధాలు నెరపటం వెనక కారణం ఏంటి? అన్నది ఇప్పుడు కీలకంగా మారనుంది. టాలీవుడ్ కు చెందిన మరో ఫ్యామిలీకి చెందిన వ్యక్తి కూడా రియా చక్రవర్తికి అనుకూలంగా పదే పదే ప్రకటనలు ఇవ్వటం కూడా ఇప్పుడు పరిశ్రమలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. సినిమా పరిశ్రమలో కొంత మంది గంజాయితోపాటు డ్రగ్స్ వాడకానికి గత కొన్నేళ్ళుగా అలవాటు పడ్డారని చెబుతున్నారు. ఈ విషయం పరిశ్రమలో అందరికీ తెలుసని పరిశ్రమకు చెందిన ప్రముఖుడు ఒకరు తెలిపారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు వ్యవహారంలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు రావటంతో రాజకీయ వర్గాల్లోనూ కలకలం రేపుతోంది. రియా చక్రవర్తితో రకుల్ ప్రీత్ సింగ్ చాలా సన్నిహితంగా ఉన్న ఫోటోలు చాలానే ఉన్నాయి దీంతో వీరిద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నట్లు చెబుతున్నారు.