దేశంలోని పది వేల కీలక వ్యక్తులపై డ్రాగన్ నిఘా
రాష్ట్రపతి, ప్రధాని మోడీతోపాటు కేంద్ర మంత్రులు..సీఎంలపై కూడా
ద ఇండియన్ ఎక్స్ ప్రెస్ సంచలన కథనం
ఇదో కొత్త తరహా యుద్ధం. పైకి ఏమీ కన్పించదు. కానీ లోపల మాత్రం జరగాల్సిన నష్టం జరిగిపోతూనే ఉంటుంది. ఓ వైపు సరిహద్దుల్లో ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్న చైనా..మరో వైపు బిగ్ డేటా ఆధారంగా ఎంపిక చేసిన కంపెనీలతో దేశంలోని ప్రముఖుల చెందిన వ్యవహారాలపై నిఘా పెట్టింది. అత్యంత రహస్యంగా దేశంలోని ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన సమాచారం అంతా శత్రుదేశం చైనా సేకరిస్తోంది. ఇందులో రాష్ట్రపతి దగ్గర నుంచి మొదలుపెడితే ప్రధాని నరేంద్రమోడీతో సహా కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, దేశంలోని ప్రముఖ ప్రతిపక్ష నేతలు, జ్యుడిషియరీలోని కీలక వ్యక్తులు, బ్యూరోక్రాట్లు..సినీ ప్రముఖులు, ఆర్ధిక నేరగాళ్లు కూడా ఉన్నారు. వీరందరి పైనా చైనా నిఘా పెట్టింది. ఈ అంశంపై రెండు నెలల పరిశోధన తర్వాత ‘ద ఇండియన్ ఎక్స్ ప్రెస్ ’ సంచలన కథనాన్ని ప్రచురించింది. రష్యా కూడా గతంలో హైబ్రిడ్ వార్ మోడల్స్ ను ఫాలో అయినట్లు సమాచారం చెబుతోంది.
హైబ్రిడ్ వార్ లో పలు అంశాలు ఇమిడి ఉన్నాయి. ప్రధానంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయటం. ఇదే నిజం అని నమ్మేలా విస్తృతంగా ప్రచారం లో పెట్టడం. రాజకీయంగా, ఆర్ధికంగా ఆయా దేశాలపై బలవంతపు పద్దతుల ద్వారా ఒత్తిడి చేసి ప్రయోజనం పొందేలా నిర్ణయాలు తీసుకొనే పరిస్థితి కల్పించటం. తాము లక్ష్యంగా ఎంచుకున్న దేశంలోని పలు కీలక విభాగాలకు చెందిన సంస్థలు, కార్యాయాలు, బ్యాంకులు,, ఇతర సంస్థలపై సైబర్ ఎటాక్స్ చేయటం, తప్పుదారి పట్టించేలా సమాచారం అందజేయటం వంటి అంశాలు ఇందులో ఇమిడి ఉంటాయి. దీంతోపాటు కొంత మంది వ్యక్తులను ప్రవేశపెట్టి బలవంతంగా ఆ దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా చేయటం వంటి అంశాలు హైబ్రిడ్ వార్ లో ముఖ్యాంశాలుగా ఉన్నాయి. చైనా ప్రభుత్వంతోపాటు చైనా కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధం ఉన్న షెంజెన్ కు చెందిన టెక్నాలజీ కంపెనీ ఈ నిఘాకు పాల్పడినట్లు ద ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం పేర్కొంది. జెన్ హు అనే ఈ చైనా కంపెనీ ఆ దేశ ఇంటెలిజెన్స్, మిలటరీతోపాటు ఇతర సెక్యూరిటీ ఏజెన్సీల కోసం పనిచేస్తుందని తెలిపారు.