సచిన్ పైలట్ రివర్స్ గేర్..రాజస్ధాన్ అనిశ్చితికి తెర

Update: 2020-08-10 15:16 GMT

రాజస్థాన్ రాజకీయ సంక్షోభానికి తెరపడింది. అసమ్మతి నేత సచిన్ పైలట్ కాంగ్రెస్ అధిష్టానంతో జరిపిన చర్చలు ఫలప్రదం అయ్యాయి. దీంతో గత కొన్ని రోజులుగా సాగుతున్న అనిశ్చితికి తెరపడినట్లే కన్పిస్తోంది. సచిన్ పైలట్ సోమవారం నాడు ఢిల్లీలో రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీతో కూడా చర్చలు జరిపారు. తన డిమాండ్లు పార్టీ అధిష్టానం ముందు ఉంచారు. అధిష్టానం కూడా వీటిని పరిష్కరించేందుకు సమ్మతించింది. సచిన్ లేవనెత్తిన అంశాలను పరిష్కరించేందుకు ముగ్గురు సభ్యులతో ఓ కమిటీ ఏర్పాటు చేయనున్నారు.

ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కె సీ వేణుగోపాల్ అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. రాహుల్ తో భేటీ సందర్భంగా తాను కాంగ్రెస్ పార్టీతో కలసి పనిచేయటానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారని తెలిపారు. ఆగస్ట్‌ 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో అసమ్మతి సద్దుమణగటంతో సీఎం అశోక్ గెహ్లాట్ ప్రస్తుతానికి ముప్పుతప్పినట్లే. బిజెపి కూడా ఆపరేషన్ లో విఫలమైనట్లు కన్పిస్తోంది.

 

 

Similar News