రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ మృతి

Update: 2020-08-01 12:56 GMT

ఒకప్పుడు దేశ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ శనివారం నాడు మరణించారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. సింగపూర్ లో చికిత్స పొందుతూనే తుది శ్వాస విడిచారు. అమర్ సింగ్ వయస్సు 64 సంవత్సరాలు. 2013 నుంచి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. 1956 జనవరి 27 ఉత్తరప్రదేశ్‌లోని అజమ్‌ఘర్‌లో జన్మించిన అమర్‌సింగ్‌1996లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికైయ్యారు. 2016లో చివరి సారిగా పెద్దల సభకు ఎస్పీ నుంచి నామినేట్‌ అయ్యారు. అమర్‌సింగ్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఎస్పీలో సీనియర్‌ నేతగా గుర్తింపు పొందిన అమర్‌సింగ్‌ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌కు అత్యంత సన్నిహితుడు. 2008లో కేంద్రంలోని యూపీఏ సర్కారుకు అణు ఒప్పందం విషయంలో వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకోగా..అమర్ సింగ్ కీలకపాత్ర పోషించి సమాజ్ వాది పార్టీ మద్దతు ఇప్పించటంలో విజయవంతం అయ్యారు. 2010లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ అమర్ సింగ్, జయప్రదలను సమాజ్ వాది పార్టీ నుంచి బహిష్కరించారు.

Similar News