పీ వీకి భారత రత్న కోసం తీర్మానం..నెక్లెస్ రోడ్డుకు పీవీ పేరు

Update: 2020-08-28 13:41 GMT

తెలంగాణ సీఎం కెసీఆర్ శుక్రవారం నాడు దివంగత మాజీ ప్రధాని పీ వీ నరసింహరావుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబర్ 7 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పీవీకి భారతరత్న ఇవ్వాలని కోరుతూ తీర్మానం చేయనున్నట్లు తెలిపారు. అదే సమయంలో హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డుకు పీవీ జ్ఞాన మార్గ్ గా పేరు పెట్టాలని నిర్ణయించారు. హైదరాబాద్ లో పీవీ మెమోరియల్ నిర్మించనున్నట్లు వెల్లడించారు. పివి శత జయంతి ఉత్సవాల నిర్వహణపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ‘‘పీవీ నరసింహారావు తెలంగాణ అస్తిత్వ ప్రతీక. భారత దేశంలో అనేక సంస్కరణలు అమలు చేసిన గొప్ప సంస్కర్త. ప్రపంచం గుర్తించిన మహామనిషి. దేశ ప్రధానిగా ఎదిగిన తెలంగాణ బిడ్డ. అసెంబ్లీలో పీవీ నరసింహారావు పొట్రేయిట్ (తైల వర్ణ చిత్రం – చిత్తరువు) పెట్టాలని నిర్ణయించాం. భారత పార్లమెంటులో కూడా పీవీ పొట్రెయిట్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతాం. హైదరాబాద్ లో పివి నెలకొల్పిన సెంట్రల్ యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేస్తాం’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు’.

.పీవీ పుట్టిన లక్నెపల్లి, పెరిగిన వంగర గ్రామాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ది చేయాలని సమావేశంలో నిర్ణయించారు. త్వరలోనే ఆ గ్రామాలను సందర్శించి, పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసే ప్రణాళిక తయారు చేయాల్సిందిగా సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ స్థాయిలో పివి మెమోరియల్ ఏర్పాటు చేయాలి. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన పివి జీవితమంతా వివిధ రంగాల్లో చేసిన కృషి ప్రస్ఫుటించేలా మెమోరియల్ ఏర్పాటు చేయాలి. ఇందుకోసం అనువైన స్థలాన్ని ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. పీవీ నరసింహరావు శత జయంతి ఉత్సవాలను ప్రపంచంలోని వివిధ దేశాల్లో నిర్వహించాలి. ఇప్పటికే అమెరికా, సింగపూర్, సౌతాఫ్రికా, మలేసియా, మారిషస్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, కెనడా తదితర దేశాల్లో కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మిగతా దేశాల్లో కూడా కార్యక్రమాల షెడ్యూల్ రూపొందించాలి.

 

Similar News