అయోధ్య భూమి పూజకు రాష్ట్రపతిని పిలవాల్సింది

Update: 2020-08-09 14:24 GMT

బిఎస్పీ అధినేత్రి మాయావతి అయోధ్య వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ భూమి పూజకు ప్రధాని మోడీతోపాటు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను ఆహ్వానించి ఉండాల్సిందన్నారు. ఆగస్ట్‌ 5న జరిగిన మందిర శంకుస్ధాపనకు దళిత వర్గానికి చెందిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌నూ పిలిచి ఉంటే ఆయన హాజరు మంచి సందేశం పంపి ఉండేదని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు దళిత సాధువులు ఆసక్తి కనబరిచినా వారిని పూర్తిగా విస్మరించారని మాయావతి ఆరోపించారు.

మరోవైపు లక్నోలో 108 అడుగుల ఎత్తైన పరుశురాముని విగ్రహ ఏర్పాటుకు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ప్రతిపాదనను ఆమె దుయ్యబట్టారు. బ్రాహ్మణ ఓటర్లను ఆకట్టుకునేందుకే ఎస్పీ ఈ ఎత్తుగడ వేస్తోందని ఆరోపించారు. పరశురాముడి విగ్రహం గురించి ఎస్పీ ఇప్పుడు మాట్లాడటం కంటే అధికారంలో ఉన్నప్పుడే ఆ విగ్రహాన్ని నిర్మించాల్సిందని చురకలు వేశారు. ఎస్పీ ప్రతిపాదిత విగ్రహం కంటే అధికంగా పరశురాముడి భారీ విగ్రహాన్ని అయోధ్యలో నిర్మిస్తామని మాయావతి పేర్కొన్నారు.

 

 

Similar News