అమెరికాలో హోరాహోరీ మొదలైంది. ఎన్నికల సమయం దగ్గరపడటంతో ప్రచారపర్వం ఊపందుకుంది. డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్ధి జో బిడెన్, తాజాగా ప్రకటించిన ఉపాధ్యక్ష అభ్యర్ధి కమలాహారిస్ తొలిసారి ఓ ప్రచార సభలో పాల్గొన్నారు. ముఖ్యంగా కరోనాను నియంత్రించటంలో ట్రంప్ వైఫల్యం ఈ సారి అత్యంత కీలకంగా మారనుంది. ఇదే ఆయన ఓటమికి కారణం అవుతుందనే వాదన కూడా బలంగా విన్పిస్తోంది. ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలను వీరు తమ అస్త్రాలుగా మార్చుకోనున్నారు. క్లైమెట్ చేంజ్ పై నిర్ణయాన్ని మార్చుకోవడం, వెల్లువెత్తిన నిరసనలను వీరు ప్రస్తావిస్తున్నారు.
ట్రంప్ అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ట్రంప్ అసమర్థతవల్ల దేశం రోగాల పాలైందని, మరణాలు సంభవించాయని, నిరుద్యోగం పెరిగిపోయిందని మండిపడ్డారు. జాతి నాయకత్వలేమిలో కూరుకుపోయిందని, దేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం క్లిష్టతరమవుతోందని విమర్శించారు. వీళ్ళ ప్రచారసభ ముగిసిన 2 గంటల్లోనే ట్రంప్ స్పందించారు. కమలాహారిస్ ఓ పిచ్చిదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో జో బిడెన్ ను ఆమె అవమానపరిచినంతగా మరెవరూ అవమానించలేదని, అతని గురించి ఎన్నో భయంకర విషయాలను చెప్పిందన్నారు. ఇప్పుడవన్నీ మర్చిపోయి, ఉపాధ్యక్ష పదవికోసం ఆయన్ను అద్భుతమైనవ్యక్తిగా కొనియాడుతోందని మండిపడ్డారు.