ఆగస్టు 25న అపెక్స్ కౌన్సిల్ సమావేశం

Update: 2020-08-18 16:43 GMT

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలకు సంబంధించి చర్చల కోసం కేంద్ర జలవనరుల శాఖ ఆగస్గు 25న అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసింది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో తెలంగాణ సీఎం కెసీఆర్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. వీడియో కాన్పరెన్స్ మార్గం ద్వారా ఈ సమావేశం జరగనుంది. ఇప్పటికే తెలంగాణ సీఎం కెసీఆర్, ఏపీ సీఎం జగన్ లు కూడా అపెక్స్ కమిటీ సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు కూడా. కొద్ది రోజుల క్రితం జరిగిన సమావేశంలో ఏపీ సర్కారు తో తాము సఖ్యత కోరుకుంటుంటే వాళ్లు కెలికి కయ్యం పెట్టుకుంటున్నారంటూ కెసీఆర్ వ్యాఖ్యానించగా..సీఎం జగన్ మాత్రం తెలంగాణ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని..ఏపీకి కేటాయించిన నీటిలోనే రాయలసీమ కరవు నివారణ ప్రాజెక్టుతోపాటు ఇతర పనులు చేపడుతున్నామని తెలిపారు.

రెండు రాష్ట్రాలు ఒకరి ప్రాజెక్టులపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు. కృష్ణా బోర్డు పలు సిఫారసులు చేసినా పట్టించుకోకుండా ఎవరి పని వాళ్లుచేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఏపీ సర్కారు టెండర్లు పూర్తి చేసుకునేందుకు వీలుగానే సీఎం కెసీఆర్ కావాలనే అపెక్స్ కమిటీ సమావేశం వాయిదా వేయించారని తెలంగాణలో విపక్షాలు విమర్శలు గుప్పించాయి. వాళ్ళు చెప్పినట్లే టెండర్ల ప్రక్రియ పూర్తయింది..ఇప్పుడు అపెక్స్ కమిటీ షెడ్యూల్ కూడా ఖరారు అయింది. మరి ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు వస్తాయో వేచిచూడాల్సిందే. ఇరువురు సీఎంలు ఎవరి వాదన వారు గట్టిగా విన్పించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

Similar News