తెలంగాణలో కరోనా టెస్ట్ ల వ్యవహారంపై హైకోర్టు మరోసారి తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అన్ని పరీక్షలకు సంబంధించి గరిష్ట ధరను ఖరారు చేయాలని సర్కారును ఆదేశించింది. కోవిడ్ వైద్య సేవలు అందిస్తున్న అత్యంత కీలకమైన గాంధీ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేయకపోవటంపై తెలంగాణ హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. గాంధీ ఆస్పత్రిలోనూ కరోనా పరీక్షలు జరపాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం కల్పించిన అధికారాలతో ప్రైవేటు ఆస్పత్రులను నియంత్రించాలని సూచించింది.
కరోనా బాధితులకు నాలుగు లక్షల రూపాయలకు పైగా బిల్లులు వేసిన యశోద, కిమ్స్ ఆస్పత్రులపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆస్పత్రుల్లో బెడ్లు, వెంటిలేటర్ల వివరాలను విస్తృత ప్రచారం చేయాలని సూచించింది. నాచారం ఈఎస్‌ఐ ఆస్పత్రిలో కరోనా చికిత్సలు చేస్తారా లేదో చెప్పాలని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో ఈ నెల 27లోగా నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీచేసింది. గత కొన్ని రోజులుగా పరీక్షలకు సంబంధించిన అంశంపై హైకోర్టు పలు ఆదేశాలు జారీ చేస్తూ వస్తోంది.