ఆ సిలబస్ నుంచి సెక్యులరిజం..పౌరసత్వం..జాతీయవాదం గాయబ్

Update: 2020-07-08 04:43 GMT

కరోనా కారణంగా విద్యా సంవత్సరంపై తీవ్ర ప్రభావం పడుతోంది. అందుకే సిలబస్ లో మార్పులు చేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల శాఖ కూడా ఆదేశాలు జారీ చేసింది. మాధ్యమిక విద్య కేంద్రీయ బోర్డు (సీబీఎస్ఈ) తొమ్మిదవ తరగతి నుంచి 12 వ తరగతి వరకూ సిలబస్ లో 30 శాతం మేర కోత పెట్టనుంది. సిలబస్ హేతుబద్దీకరణ చేయాలని సూచించగా..బోర్డు మంగళవారం నాడు సమాఖ్యవిధానం, పౌరసత్వం, జాతీయవాదం, సెక్యులరిజం చాఫ్టర్లను పూర్తిగా తొలగించేశారు. ఇది ఇప్పుడు జాతీయ స్థాయిలో పెద్ద దుమారం రేపుతోంది. 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి 11వ తరగతి విద్యార్ధుల పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్ నుంచి ఈ చాప్టర్లను పూర్తిగా తొలగించేశారని ‘ద ఇండియన్ ఎక్స్ ప్రెస్’ కథనం పేర్కొంది.

ఇందులో ఉప విభాగాలుగా ఉన్న మనకు స్థానిక ప్రభుత్వాలు ఎందుకు?, భారత్ లో స్థానిక ప్రభుత్వాల ప్రగతి అన్న అంశాలను కూడా తొలగించేశారు. మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకే ఈ ఛాప్టర్లను తొలగించినట్లు సీబీఎస్ఈ చెబుతోంది. అదే సమయంలో సీబీఎస్ఈ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తొలగించిన ఛాప్టర్లకు సంబంధించి వివిధ టాపిక్ ల విషయంలో అవసరాన్ని బట్టి తొలగించిన సబ్జెక్ట్ లను విద్యార్ధులకు వివరిస్తారని పేర్కొంది. అయితే తొలగించిన చాప్టర్లు అంతర్గత అంచనా పరీక్షలతోపాటు..వార్షిక పరీక్షల్లో మాత్రం ఉండబోవని స్పష్టం చేశారు. సర్కారు నిర్ణయంపై రిచా చడ్డా ట్విట్టర్ లో ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ఇది హేతుబద్దీకరణ కాదు..ప్రజాస్వామ్యాన్ని శానిటైజ్ చేయటం అని వ్యంగంగా స్పందించారు.

 

Similar News