విజయవాడ జైలుకు అచ్చెన్నాయుడు

Update: 2020-07-01 16:29 GMT

మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని విజయవాడ జైలుకు తరలించారు. ఆయన్ను బుదవారం నాడు గుంటూరులోని ప్రభుత్వ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. తనకు పరీక్షలు అన్నీ పూర్తయ్యే వరకూ డిశ్చార్జ్ చేయవద్దని, కొలనోస్కోపీ పరీక్షా ఫలితాలు కూడా రావాల్సి ఉందని, కరోనా సమయంలో కోవిడ్ టెస్ట్ చేయకుండా జైలులోకి అనుమతించరు కాబట్టి ఆ పరీక్షలు కూడా చేయాలని అచ్చెన్నాయుడు ఆస్పత్రి సూపరిండెంట్ కు లేఖ రాశారు. కానీ ఆస్పత్రి అధికారులు మాత్రం డిశ్చార్జ్ చేయటంతో ఆయన్ను విజయవాడ జైలుకు తరలించారు. ఈఎస్ఐ స్కామ్ లో ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ-2గా ఉన్న అచ్చెన్నాయుడుకు ఏసీబీ కోర్టు రిమాండ్‌ విధించిన సంగతి తెలిసిందే.

అయితే అచ్చెన్నాయుడి డిశ్చార్జ్ ను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తప్పుపట్టారు. పూర్తిగా కోలుకుండానే కావాలనే కక్షపూరితంగా జైలుకు తరలించారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా అచ్చెన్నాయుడిని హడావుడిగా జైలుకు తరలించటం కుట్రతోనే అని ఆరోపించారు. ఆస్పత్రిలో చేసిన పరీక్షలకు సంబంధించిన ఫలితాలు రాక ముందే ఇంత హడావుడిగా డిశ్చార్జ్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.

Similar News