ఢిల్లీకి సీఎం జగన్

Update: 2020-06-01 07:39 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు ఢిల్లీ పర్యటన తలపెట్టారు. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం హోం మంత్రి అమిత్ షాతో సమావేశం మాత్రం ఖరారు అయినట్లు చెబుతున్నారు. అవకాశాన్ని బట్టి ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఇతర కేంద్ర మంత్రులను కూడా కలిసే ఛాన్స్ ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తన ఏడాది పాలనకు సంబంధించిన నివేదికను అందజేయటంతోపాటు అదే సమయంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు..ప్రాజెక్టుల గురించి చర్చించే లక్ష్యంతోనే జగన్ ఈ పర్యటన పెట్టుకున్నట్లు చెబుతున్నారు. అయితే ఓ వైపు దేశమంతటా కరోనా టెన్షన్..లాక్ డౌన్ సమయంలో జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. గత కొన్ని రోజులుగా ఏపీలో పరిణామాలు సర్కారు వర్సెస్ న్యాయవ్యవస్థ అన్న తరహాలో సాగుతున్నాయి. ముఖ్యంగా డాక్టర్ సుధాకర్ కేసులో హైకోర్టు సీబీఐ విచారణ ఆదేశించటం..దీనిపై వైసీపీ శ్రేణులు..ఎమ్మెల్యేల నుంచే అభ్యంతరకర వ్యాఖ్యలు రావటం కలకలం రేపింది.

ఆ తర్వాత ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు వివాదంలో హైకోర్టు ఇఛ్చిన తీర్పు విషయంలో కూడా సర్కారు సుప్రీంను ఆశ్రయించాలని నిర్ణయించింది. న్యాయవ్యవస్థతో సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. అదే సమయంలో అదికార వైసీపీ మాత్రం తమ విధానంలో ఎలాంటి పొరపాట్లు లేవని..ప్రతిపక్షాలే ప్రతిదానికి కోర్టులను ఆశ్రయించి కావాలని అడ్డంకులు సృష్టిస్తున్నాయని విమర్శిస్తోంది. ఈ తరుణంలో జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న మండలి రద్దు విషయంలో కూడా నిర్ణయం తీసుకోవాల్సిందిగా జగన్ కోరే అవకాశం ఉందని చెబుతున్నారు.

Similar News