ఉద్ధవ్ ఠాక్రేకు ‘మహా ఊరట’

Update: 2020-05-14 11:18 GMT

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు పెద్ద ఊరట. ఎప్పుడైతే కేంద్రం జోక్యంతో మహారాష్ట్రలో ఎమ్మెల్సీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ లభించిందో అప్పుడే ఆయనకు బిగ్ రిలీఫ్ దొరికినా..ఆ ఎన్నిక కూడా ఏకగ్రీవం కావటంతో శివసేన శ్రేణులకు ఇది మరింత ఆనందకర పరిణామంగా చెప్పొచ్చు. ఉద్దవ్ ఠాక్రే శాసన మండలి సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు గురువారం అధికారిక ప్రకటన వెలువడింది. ఆయనతోపాటు మరో 8 మంది సభ్యులు కూడా ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా విజయం సాధించారు. మహారాష్ట్రలో ఖాళీగా ఉన్న తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల నుంచి అయిదుగురు, బీజేపీకి చెందిన నలుగురు పోటీలో నిలిచారు.

సరిగ్గా తొమ్మిది మంది బరిలో నిలవడంతో.. వీరి ఎన్నిక ఏకగ్రీవమైంది. గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో.. మొత్తం తొమ్మిది మంది ఏకగ్రీవంగా గెలుపొందినట్టు అధికారులు ప్రకటించారు. ఉద్ధవ్‌ సీఎంగా కొనసాగాలంటే.. మే 27లోపు ఆయన ఎమ్మెల్యేగా గానీ, ఎమ్మెల్సీ గానీ గెలుపొందాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఎలాంటి పోటీ లేకుండా ఉద్ధవ్‌ శాసన మండలిలోకి అడుగుపెట్టారు. దీంతో గత కొన్ని నెలలుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్లు అయింది.

 

 

 

Similar News