వలస కూలీలను సరిహద్దుల్లో వదిలేస్తామనం సరికాదు

Update: 2020-05-17 07:11 GMT

వలస కూలీల బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. కార్మికుల కష్టాలు హృదయాన్ని ద్రవింపచేస్తున్నాయని అన్నారు. ‘రాయలసీమ నుంచి ఉత్తరాంధ్రకు బయలుదేరిన ఓ వలస కూలీ కుప్పకూలి ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి. అన్ని రాష్ట్రాలు సమన్వయంతో వ్యవహరిస్తేనే వలస కూలీల వెతలు తీరుతాయి. రాష్ట్ర ప్రభుత్వాలు మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. ప్రజా ప్రతినిధులు అందరూ కూడా వలస కూలీలను ఆదుకోవటంలో భాగస్వాములు కావాలి’ అని పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో కోరారు. కేంద్ర ప్రభుత్వం శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా కార్మిక కుటుంబాలను తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన సమన్వయంతో వ్యవహరించి వారిని సురక్షితంగా చేర్చాలి. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రజా రవాణా వ్యవస్థ బస్సులను కూడా కూలీ స్వస్థలాల వరకూ నడపాలి.

ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమ సరిహద్దు దగ్గర వదిలిపెడతాం అనడం బరువు వదిలించుకొన్నట్లు అవుతుంది. సరిహద్దు రాష్ట్రాల దగ్గర కొత్త సమస్యలు వస్తాయి. అప్పుడూ ఇబ్బందిపడేది కార్మికులే. కాబట్టి వలస కూలీలకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి బస్సుల ద్వారానో, శ్రామిక్ రైళ్ల ద్వారానో చేర్చాలి. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రాలు సమన్వయం చేసుకొని వలస కార్మికులను ఆదుకోవాలి. వారికి అవసరమైన ఆహార వసతి కోసం ఎన్.డి.ఆర్.ఎఫ్. నిధులు కూడా వినియోగించుకొనే అవకాశం ఉంది. తమిళనాడు నుంచి తిరిగి వస్తున్న ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన కార్మికులను తడ సరిహద్దుల్లో నిలిపివేసి అనుమతించడం లేదనే విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. అటు నుంచి వస్తున్న ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలవారిని ఆధార్ కార్డ్ చూసి వదులుతున్నారు. మన రాష్ట్రం వారిని విడిచిపెట్టడం లేదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి అనుమతులు ఇచ్చి వైద్య పరీక్షలు చేయించాలి. గుంటూరు జిల్లా తాడేపల్లి దగ్గర వలస కార్మికులపై లాఠీఛార్జీ చేయడం బాధాకరమన్నారు.

 

Similar News