జగన్..కెసీఆర్ ‘నీళ్ళ రాజకీయం రివర్స్’!

Update: 2020-05-13 07:23 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణలో ప్రాజెక్టు కడుతుంటే అప్పుడు ముఖ్యమంత్రి గా ఉన్న చంద్రబాబునాయుడు ఏమి చేశారని ప్రశ్నించారు. గోదావరి పరవళ్ళకు సంకెళ్ళు అంటూ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. సీన్ కట్ చేస్తే అదే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ హాజరయ్యారు. తెలంగాణ సీఎం కెసీఆర్ కూడా శాలువ కప్పి...జ్ణాపిక ఇచ్చి పంపారు. తర్వాత ఇద్దరు సీఎంలూ కలసి సుమారు లక్ష కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఓ ఉమ్మడి ప్రాజెక్టు ప్రతిపాదించారు. ఆ సమయంలో ఇక అసలు రెండు రాష్ట్రాల మధ్య జల జగడాలు ఉండవని..అప్పుడు కొంత మంది వ్యక్తుల వల్లే సమస్యలు వచ్చాయని తెలంగాణ సీఎం కెసీఆర్ కూడా చంద్రబాబునుద్దేశించి వ్యాఖ్యానించారు. ఇక కలసి ముందుకు సాగుతామని ప్రకటించారు. అది ఎంతలా అంటే గతంలో తెలంగాణ తరపున పోలవరంతోపాటు ఇతర ప్రాజెక్టులపై చేసిన ఫిర్యాదులు కూడా వెనక్కి తీసుకుంటామనే వరకూ వెళ్ళింది వ్యవహారం. కానీ కారణాలు ఏంటో తెలియదు కానీ తర్వాత ఉమ్మడి ప్రాజెక్టు అటకెక్కింది. కానీ 2019 జులైలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ సీఎం కెసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

కెసీఆర్ చాలా మంచివారని..తెలంగాణతో గొడవలు పడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. కెసీఆర్ ఎంతో ఉదారంగా ముందుకొస్తే స్వాగతించాల్సింది పోయి విమర్శలు చేస్తారా? అని ప్రశ్నించారు. ఏపీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఇదంతా చేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు మాత్రం రాయలసీమకు నీళ్ళు తీసుకెళుతుంటే మానవత్వంతో వ్యవహరించాలని అంటున్నారు. కేటాయింపుల మేరకే నీటిని వాడుకుంటున్నామని..ఇందులో ఎలాంటి ఉల్లంఘనలు లేవని జగన్ తేల్చి చెబుతున్నారు. మరి ఇన్ని చెబుతున్న జగన్ ఎలాంటి ఉల్లంఘనలు లేకపోతే తాను ఎంతో మంచివారని సర్టిఫికెట్ ఇచ్చిన కెసీఆర్ ను ఈ విషయంలో ఎందుకు ఒప్పించలేకపోతున్నారనే ప్రశ్న ఉదయిస్తుంది. ఏ రాష్ట్రం అయినా బోర్డుల కేటాయింపుల మేరకే నిబంధనల ప్రకారం నీటిని వినియోగించుకోవాల్సి ఉంటుంది కానీ ఇందులో మానవత్వానికి.మంచితనాలకు చోటు ఎక్కడ ఉంటుంది?.

తెలంగాణ సీఎం కెసీఆర్ కూడా ఉమ్మడి ప్రాజెక్టుపై రెండు దఫాలు జగన్ తో సమావేశం అయిన సమయంలో అసలు ఇక ఏపీ, తెలంగాణలు గొడవ పడాల్సిన అవసరమే లేదని..అది అంతా గతం అని ప్రకటించారు. ఇక నుంచి ఏపీతో కలసి సాగుతామని ప్రకటించారు. అంతే కాదు ఓ సారి ఏపీ పర్యటనకు వెళ్లిన సీఎం కెసీఆర్ ఏకంగా ‘రాయలసీమను సస్యశ్యామలం’ చేస్తామని ప్రకటించేశారు కూడా. కానీ కెసీఆర్ ఇప్పుడు ఏపీ సర్కారు జారీ చేసిన జీవో 203పై ఫిర్యాదు చేయటంతోపాటు న్యాయపరంగా పోరాటానికి రెడీ అవుతుంది. ఈ ప్రాజెక్టు విషయంలో ఎవరిది తప్పు..ఎవరిది ఒప్పు అనేది నీళ్ల కేటాయింపులు చూస్తే చట్టబద్ధ సంస్థలు, కోర్టులు మాత్రమే తేల్చగలవు. కానీ ఇద్దరు ముఖ్యమంత్రులు చేసిన రాజకీయ ప్రకటనలు...ఇప్పుడు అనుసరిస్తున్న విధానాలు మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Similar News