కరోనాను ఆపగలిగే శక్తి ప్రభుత్వానికి లేదు

Update: 2020-05-29 15:16 GMT

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కరోనాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనాను ఆపగలిగే శక్తి ప్రభుత్వానికి లేదని..ఎవరికి వారే జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎవరూ నిర్లక్ష్యంగా ఉండకూడదని అప్రమత్తతతో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా అసలు కథ ఇప్పుడే మొదలవుతుందని అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో జరిగిన సమగ్ర వ్యవసాయం - సుస్థిర వ్యవసాయం అనే కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ... తెలంగాణలో కరోనా అసలు కథ ఇప్పుడే మొదలైంది. ప్రస్తుతం ఇతర దేశాల, రాష్ట్రాల నుండి ప్రజలు వస్తున్నందున పల్లెలు, పట్టణాలు క్షేమంగా ఉండే పరిస్థితి లేదు. మొదటి రెండు నెలలు లాక్ డౌన్ విషయంలో సీరియస్ గా వ్యవహరించాం కాబట్టే.. ఎక్కువ స్థాయిలో విస్తరించలేదు.

ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కరోనాను లైట్ తీసుకోవద్దు. జూన్, జూలై నెలలో ఎక్కువగా కరోనా విస్తరించే ప్రమాదం ఉంది. కరోనా అదుపులోకి వచ్చి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తి వేస్తే వచ్చే నెలలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ను హుజురాబాద్ నియోజక వర్గానికి తీసుక వస్తా. రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ విధానానికి రైతులు సంపూర్ణ మద్దతు ఇవ్వాలి. ఈ సంవత్సరం 71 వేల ఎకరాల్లో తెలంగాణ రైతులు పంట పండించారు. దేశంలో అందరికి తెలంగాణ రైతులు అన్నం పెడుతున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రైతులు ధనవంతులు కాబోతున్నారు అని పేర్కొన్నారు.

 

Similar News