విశాఖపట్నంలో విషాదానికి కారణమైన ఎల్ జీ పాలిమర్స్ సంస్థపై కేసు నమోదు అయింది. గురువారం తెల్లవారు జామున చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో పది మంది మరణించగా..వందల మంది అనారోగ్యం పాలయ్యారు. కొంత మందికి వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్యాక్టరీ నిర్లక్ష్యం కారణంగానే గ్యాస్ లీక్ అయిందనే విమర్శలు విన్పిస్తున్నాయి. లాక్ డౌన్ తర్వాత కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించేందుకు రెడీ అయిన తరుణంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. అంతే కాదు..కేంద్రం కూడా ఈ ఘటనపై స్పందించి తగు చర్యలకు ఆదేశించింది. ఈ తరుణంలో ఎల్ జీ పాలిమర్స్ యాజమాన్యంపై గోపాలపట్నం పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. గోపాలపట్నం వీఆర్ వో ఎంవీ సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ 278, 284, 285, 337, 338, 304 తదితర సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. స్టిరెన్‌ను నిల్వ చేసే కంటైనర్ పాతబడి పోయిందని.. దాని నిర్వహణ సరిగా లేనందు వల్లే గ్యాస్ లీకైందని చెబుతున్నారు.