మోడీపై కమల్ హాసన్ ఫైర్

Update: 2020-04-06 13:16 GMT

లాక్ డౌన్ అంశంపై ప్రదాని నరేంద్రమోడీ తీరును ప్రముఖ నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ తీవ్రంగా తప్పుపట్టారు. నాడు పెద్ద నోట్ల రద్దు వంటి కీలక నిర్ణయాన్ని తొందరపాటుగా తీసుకున్నట్లే..ఇప్పుడు లాక్ డౌన్ విషయంలోనూ వ్యవహరించినట్లు కన్పిస్తోందని పేర్కొన్నారు. ఈ మేరకు మోడీకి కమల్ హాసన్ ఘాటు లేఖ రాశారు. దేశవ్యాప్తంగా మూడు వారాల పాటు ప్రకటించిన లాక్‌డౌన్‌ అమలు లోపభూయిష్టంగా ఉందని వ్యాఖ్యానిస్తూ సార్‌ ఈ సారి మీ విజన్‌ విఫలమైందని లేఖలో ప్రస్తావించారు. ప్రణాళికాబద్ధంగా లాక్‌డౌన్‌ ప్రకటించని లోపానికి సాధారణ ప్రజలను నిందించలేమని, విపత్తుగా ముంచుకొచ్చిన మహమ్మారి కట్టడికి ఎలాంటి ప్రణాళిక, కసరత్తు లేకుండా ఉందన్నారు.

140 కోట్ల మంది ప్రజలను కేవలం 4 గంటల వ్యవధిలో లాక్‌డౌన్‌కు సిద్ధం కావాలని పిలుపు ఇచ్చిన మీకు నాలుగు నెలల ముందే వైరస్‌ సమాచారం ఉన్నా 4 గంటల నోటీసుతోనే ప్రజలకు లాక్‌డౌన్‌ ఉత్తర్వులు ఎలా జారీ చేశారని ప్రధానిని ఉద్దేశించి కమల్‌ హాసన్‌ పేర్కొన్నారు. నోట్ల రద్దు తరహాలోనే భారీ స్ధాయిలో మరో తప్పిదం చోటుచేసుకుంటుందా అనే భయం తనను వెంటాడుతోందని అన్నారు. మరోవైపు లాక్‌డౌన్‌ ప్రకటించిన మరుసటి రోజే ప్రధానికి రాసిన తొలిలేఖలోనూ కమల్‌ పలు అంశాలు ప్రస్తావించారు. లాక్ డౌన్ సమయంలో పేదల అంశంపై ఫోకస్ పెట్టాలని ఆయన కోరారు.

 

Similar News