లాక్ డౌన్ పొడిగింపు విషయంలో కేంద్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఓ వైపు అన్ని పరిణామాలు లాక్ డౌన్ పొడిగింపు దిశగా సాగుతున్నా..కేంద్రం మాత్రం ప్రస్తుతం అందరితో చర్చించే పనిలో ఉంది. అందరితో కూలంకషంగా చర్చించాకే తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో విలేకరులు లాక్ డౌన్ అంశంపై ప్రశ్నించగా..కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ దీనిపై స్పందిస్తూ... లాక్‌డౌన్ కొనసాగింపుపై ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని చెప్పారు. పుకార్లను వ్యాపింపచేయవద్దని ఆయన మీడియాకు సూచించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్ కొనసాగించాలంటూ తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక ప్రభుత్వాలు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి.
ఆర్ధిక వ్యవస్థను నెమ్మదిగానైనా చక్కదిద్దుకోవచ్చని, ప్రజల ప్రాణాలు కాపాడుకోవడమే ప్రస్తుతం ముఖ్యమని తెలంగాణ సీఎం కేసీఆర్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కోరారు. లాక్‌డౌన్ దశలవారీగా ఎత్తెయ్యాలని, ఒక్కసారిగా ఎత్తేయడం సరికాదని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సూచించారు. లాక్‌డౌన్ మరో రెండు వారాలు కొనసాగించాలని కర్ణాటక ప్రభుత్వం కోరింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో లాక్‌డౌన్ మరికొంతకాలం కొనసాగించాలని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపె డిమాండ్ చేశారు. రాష్ట్రాల వినతులపై కేంద్రం సానుకూలంగా స్పందించి లాక్‌డౌన్ కొనసాగించే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఐఆర్ సీటీసీ కూడా ఏప్రిల్ నెలాఖరు వరకూ బుక్ అయిన రైళ్లను కూడా రద్దు చేసింది. లాక్ డౌన్ పొడిగింపు దిశగా నిర్ణయం ఉండబోతున్నందునే ఐఆర్ సీటీసీ కూడా ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు.