టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్ధులు కేకే..సురేష్ రెడ్డి

Update: 2020-03-12 11:50 GMT

తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) రాజ్యసభ అభ్యర్ధులను ఖరారు చేసింది. తెలంగాణ లో దక్కే రెండు స్థానాలకు సిట్టింగ్ ఎంపీ కె. కేశవరావుతోపాటు మాజీ స్పీకర్ కే ఆర్ సురేష్ రెడ్డి పేరును ఖరారు చేసింది. గురువారం సాయంత్రం అధికారికంగా వీరి పేర్లను ప్రకటించారు. వీళ్లిద్దరూ శుక్రవారం ఉదయం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కూడా శుక్రవారమే. టీఆర్ఎస్ లో చేరే సమయంలోనే సురేష్ రెడ్డికి ముఖ్యమంత్రి కెసీఆర్ కీలక పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఆ హామీ మేరకే ఇఫ్పుడు ఆయనకు రాజ్యసభ సీటు దక్కింది. రాజ్యసభ సీట్లు దక్కించుకున్న నేతలిద్దరూ క్యాంప్ కార్యాలయంలో సీఎం కెసీఆర్ ను కలసి కృతజ్ణతలు తెలిపారు.

ఇద్దరు నేతలను సీఎం కెసీఆర్ అభినందించారు. సామాజిక కోణంతోపాటు సీనియారిటీ కూడా కె. కేశవరావుకు రాజ్యసభ సభ్యత్వం రెన్యువల్ కు కలిసొచ్చిన అంశాలుగా మారాయి. టీఆర్ఎస్ కు దక్కే రాజ్యసభ సీట్లు ఎవరికి దక్కుతున్నాయనే అంశంపై రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కెసీఆర్ తనయ, మాజీ ఎంపీ కవితకు ఖచ్చితంగా రాజ్యసభ సీటు దక్కే అవకాశం ఉందని తొలుత ప్రచారం జరిగింది. కానీ అటు కవితకు, ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేని శ్రీనివాసరెడ్డికి కూడా నిరాశే ఎదురైంది. దామోదర్ రావు పేరు కూడా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది.

 

 

Similar News