ఏడు గంటల నుంచి ఆరు వరకూ బయటకు రావొద్దు

Update: 2020-03-23 07:31 GMT

 

‘సాయంత్రం ఏడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకూ ఎవరూ బయటికి రావొద్దు. కాదని ఎవరైనా బయటకు వస్తే కఠిన చర్యలే. అత్యవసరాలు ఏమైనా ఉంటే రాత్రి ఏడు గంటల లోపే చూసుకోవాలి. ఎవరు కూడా ఇంటి నుంచి ఒకటి, రెండు కిలోమీటర్లు మించి బయటకు పోవడానికి వీల్లేదు. ఎవరైనా బయటకు వస్తే అందుకు కారణాలు చూపాల్సి ఉంటుంది’ అని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. వీరిద్దరూ సోమవారం నాడు మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలపై ప్రజలకు సూచనలు చేశారు. తెలంగాణలో 1897 కింద లాక్ డౌన్ అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర సరిహద్దులు మూసివేయటంతోపాటు ఆర్టీసీ బస్సులు, ఆటోలు, క్యాబ్ లు కూడా బంద్ చేశామన్నారు. ఎమర్జెన్సీ సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయన్నారు. ఎక్కడా ఐదుగురి మించి గుమికూడకూడదని తెలిపారు. అన్ని రకాల పరీక్షలు వాయిదా వేసినట్లు తెలిపారు. గ్రామాల్లో మాత్రం వ్యవసాయ పనులు నడుస్తాయని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు బయట తిరిగితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ వారం రోజుల పాటు నియంత్రణలో ఉంటే కరోనా వైరస్ ను కట్టడి చేయవచ్చిని..దీని వల్ల రాష్ట్రం సేఫ్ జోన్ లోకి వస్తుందని తెలిపారు.

విదేశాల్లో జరిగిన సంఘటనలు చూసిన తర్వాత అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సమస్యను అరికట్టాలి అంటే ప్రజాలేవరూ రోడ్ల పైకి రాకూడదన్నారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. అజాగ్రత్తగా ఉంటే తీవ్రమైన పరిణామాలు ఎదురుకోవాల్సి ఉంటుంది. ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పదే పదే ఏదైనా వాహనం నిబంధనలు ఉల్లంఘిస్తే ఆ వాహనాలను సీజ్ చేస్తామని తెలిపారు. సీజ్ చేసిన వాహనాలు వైరస్ తీవ్రత తగ్గిన తరువాత రిలీజ్ చేస్తారు. మీడియా కు మాత్రం ఎక్కడైనా తిరిగే అనుమతులు ఉంటాయన్నారు. ప్రతి బైక్ పై ఒక వ్యక్తి... ఫోర్ వీలర్ పై ఇద్దరికి మాత్రమే అనుమతి. ఆటో అసోషియేషన్ కి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసాము.

 

 

Similar News