అధికార వైసీపీలో టీడీపీపై కసి రోజురోజుకు పెరుగుతున్నట్లు ఉంది. ముఖ్యమంత్రి జగన్ లో కూడా అదే కసి కన్పిస్తోంది. ఎవరూ అడగకముందే ఆయనే గతంలో ఓ సంచలన ప్రకటన చేశారు. వైసీపీలోకి ఎవరైనా రావాలంటే ఖచ్చితంగా రాజీనామా చేసే రావాలని. అసెంబ్లీ సాక్షిగా కూడా ప్రకటన చేశారు. అంతకు ముందు బయట కూడా పదే పదే ఇదే మాట చెప్పారు. తాజాగా మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి కూడా బ్లాక్ క్యాట్ కమాండోలు...ప్రతిపక్ష హోదా ఉండేసరికి చంద్రబాబు తాను ఇంకా ముఖ్యమంత్రినే అని భావిస్తున్నట్లు ఉన్నారంటూ విమర్శించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కరోనా వైరస్ కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేయటంతో అధికార వైసీపీ నేతల్లో టీడీపీపై కసి..కోపం ఏ స్థాయిలోకి వెళ్ళిందో ఆ పార్టీ నేతల మాటల్లోనే కన్పిస్తోంది. తాజాగా వైసీపీలో టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరామ్ తనయుడు చేరినా..ఎమ్మెల్యే బలరామ్ కు మాత్రం జగన్ కండువా వేయకుండా వదిలేశారు. ఆయన టీడీపీని వీడి వైసీపీకి చేరువైన సంకేతాలు స్పష్టంగా పంపేశారు.
కరణం జగన్ ను కలవటానికి ముందే మీడియా సాక్షిగా కూడా ఇదే విషయం చెప్పేశారు.. కానీ ఎమ్మెల్సీ శమంతకమణి విషయానికి వచ్చేసరికి జగన్ మాత్రం అదేమీ పట్టించుకోలేదు. ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయకపోయినా నేరుగా వైసీపీ కండువా వేసేశారు. బుధవారం నాడు తాడేపల్లిలో టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న శమంతకమణి, ఆమె కూతురు, మాజీ ఎమ్మెల్యే యామినిబాలతోపాటు మరికొంత మంది నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. గత కొన్ని రోజులుగా టీడీపీకి చెందిన నేతలు వరస పెట్టి వైసీపీలో చేరుతున్న విషయం తెలిసిందే. శమంతకమణిది అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజకవర్గం. రాబోయే రోజుల్లో కసితో మరిన్ని చేరికలకు రంగం సిద్ధం చేసే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తాజా పరిణామాలు చూస్తుంటే జగన్ తన నిబంధనను తానే ఎత్తేసినట్లు కన్పిస్తోంది.