తెలుగుదేశం పార్టీకి షాక్. కడప జిల్లాలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లుగా గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిలపై పోటీ చేసిన టీడీపీ సీనియర్ నేత సతీష్ కుమార్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. దీంతో ఇప్పుడు టీడీపీకి జిల్లాలో పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది. సతీష్ కుమార్ రెడ్డి వేంపల్లెలోని తన నివాసంలో మంగళవారం నాడు తన ముఖ్య వర్గీయులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తాను టీడీపీని వీడుతున్నట్లు సతీష్ రెడ్డి స్పష్టం చేశారు. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబంతో తలపడుతున్నా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి సరైన ఆదరణ లభించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మనసును చంపుకొని తెలుగుదేశం పార్టీలో ఉండలేనన్నారు. టీడీపీపై అసంతృప్తితోనే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నానని తన వర్గీయులకు, కార్యకర్తలకు సతీష్ తెలిపారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి రెండుసార్లు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రెండుసార్లు సతీష్ రెడ్డి పోటీ ఇచ్చారు. వారి చేతిలో ఓటమి పాలైనా... పులివెందులలో ఉన్నంతలో గట్టి నేత కావటంతో టీడీపీ సతీష్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడమే కాకుండా మండలి వైెస్ ఛైైర్మన్ ను చేసింది. మారిన పరిస్థితుల్లో సతీష్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో త్వరలోనే సతీష్ కుమార్ రెడ్డి వైసీపీలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనికి ఈ నెల 13న ముహుర్తంగా ఎంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.