ఏపీలో వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకటే రంగుల గొడవ. ప్రతి ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ జెండాలో ఉండే రంగులను వాడటం రాజకీయంగా పెద్ద వివాదంగా మారింది. ఈ వ్యవహారం చివరకు హైకోర్టుకు వెళ్లింది. ఈ అంశంపై పలుమార్లు విచారణ జరిపిన హైకోర్టు చివరకు ‘ ఆ రంగులు’ తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులను వేయడంపై విచారణ సమయంలోనే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పంచాయతీ భవనాలకు వైసీపీ రంగులను 10 రోజుల్లో తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వ భవనాలకు సీఎస్ నిర్ణయం ప్రకారమే మళ్లీ రంగులు వేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన నివేదికలను రెండు వారాల్లోగా కోర్టుకు సమర్పించాలని సీఎస్, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. లేని పక్షంలో బాధ్యులను చేస్తామని చీఫ్ జస్టిస్ ధర్మాసనం హెచ్చరించింది. పంచాయతీ భవనాలకు రంగులు వేయాలంటూ.. 2018 ఆగస్ట్ 11న పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చిన మెమోను హైకోర్టు రద్దు చేసింది. గుంటూరు జిల్లాకు చెందిన ఎం. వెంకటేశ్వరరావు ఈ అంశంపై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.