రంజన్ గొగోయ్ కు తొలి రోజే చేదు అనుభవం

Update: 2020-03-19 09:25 GMT

బహుశా దేశ చరిత్రలో ఏ రాజ్యసభ సభ్యుడికి ఈ తరహా అవమానం జరిగి ఉండొకపోవచ్చు. అది కూడా ఓ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తికి జరిగింది. ఆయనే రంజన్ గొగోయ్. ఇటీవలే రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ రంజన్ గోగోయ్ ను రాజ్యసభకు నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇవన్నీ పక్కన పెడితే గొగోయ్ గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేయటానికి రాజ్యసభకు వచ్చారు. అంతే ప్రతిపక్షాలకు చెందిన సభ్యులు అందరూ షేమ్ షేమ్ అంటూ నినాదాలు చేస్తూ..ఆయన ప్రమాణ స్వీకారాన్ని బాయ్ కాట్ చేసి బయటకు వెళ్లిపోయారు. అయితే రంజన్ గొగోయ్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన ప్రమాణ స్వీకారం చేసేసి తన సీటులో ఆశీనులయ్యారు.

అయితే ప్రతిపక్షాలు చర్యను కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తప్పుపట్టారు. రాజ్యసభ సభ్యుడిగా రంజన్‌ తన వంతు కృషి చేస్తారని పేర్కొన్నారు. 13 నెలల పాటు భారత ప్రధాన న్యాయమూర్తిగా తన సేవలందించిన అనంతరం గతేడాది నవంబర్‌లో ఆయన పదవీ విరమణ పొందారు. తనపై వచ్చిన విమర్శలపై స్పందించిన ఆయన . ‘దేశ అభివృద్ధి కోసం శాసన, న్యాయ వ్యవస్థలు ఏదో ఒక సమయంలో కలిసి పనిచేయాల్సిన అవసరముందనే నమ్మకంతోనే నేను రాజ్యసభ నామినేషన్‌ను అంగీకరించానని’ తెలిపారు.

 

 

 

Similar News