రజనీకాంత్ పొలిటికల్ రోడ్ మ్యాప్ ఇదేనంట

Update: 2020-03-12 06:18 GMT

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాలకు సంబంధించి మరింత క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ అధ్యక్షుడిగా ఉండటానికే మొగ్గుచూపుతానని..యువకుడికి సీఎం పీఠం అప్పగిస్తానని తెలిపారు. తనకు సీఎం పదవిపై ఎలాంటి మోజు లేదన్నారు. రాజకీయాల్లోకి యువత రావాల్సిన అవసరం ఉందన్నారు. తమ పార్టీలో యువతకే పెద్ద పీట వేస్తానని తేల్చిచెప్పారు. రజనీకాంత్ గురువారం నాడు మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలపై స్పష్టత ఇఛ్చారు. ఒక వ్యక్తి చేతిలో వ్యవస్థలు..పార్టీలు ఉండటం సరికాదన్నారు. పరిపాలనలో పార్టీ అధ్యక్షుడి జోక్యం కూడా ఉండకూడదనేది తన అభిప్రాయంగా చెప్పారు. ప్రస్తుత శాసనసభ్యులందరూ 50 ఏళ్లు పైబడిన వారే ఉన్నారని వ్యాఖ్యానించారు. పార్టీ వేరు. నాయకత్వాన్ని వేరే ప్రాతిపదికన నిర్ణయిస్తానని తెలిపారు. తమిళనాడులో జయలలిత మరణం తర్వాత రాజకీయ శూన్యత ఏర్పడిందని అన్నారు.

తాను రాజకీయాల్లోకి డబ్బు, హోదాల కోసం రావటంలేదన్నారు. వ్యవస్థలో మార్పు రావాల్సిన అవసరం ఉందని..ఈ దిశగా ప్రజల ఆలోచనా ధోరణి కూడా మారాల్సి ఉందని రజనీకాంత్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి వస్తానని రెండేళ్ల క్రితమే చెప్పానని..అప్పటి నుంచి తమిళనాడులోని పరిస్థితులను అధ్యయనం చేసినట్లు వెల్లడించారు. 45 సంవత్సరాలుగా తాను సినిమా రంగంలో సాధించిన పేరు రాజకీయాల్లో ప్రభావం చూపించే అవకాశం ఉందన్నారు. 68 సంవత్సరాల వయస్సులో తనకు సీఎం పీఠంపై మోజు లేదని..సీఎం అభ్యర్ధిని తయారు చేస్తానని చెప్పటమే తన ఉద్దేశమన్నారు. రాజకీయాల్లో విద్యా ప్రమాణాలు, వయస్సు కూడా కీలకమే అన్నారు.

 

Similar News