విద్యుత్ ఛార్జీలు తగ్గించిన మహారాష్ట్ర సర్కారు

Update: 2020-03-31 10:20 GMT

కరోనా సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని బయటపడేసేందుకు గాను మహారాష్ట్ర ప్రభుత్వం సగటున 8 శాతం విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ తగ్గింపు వచ్చే ఐదేళ్ళు ఉంటుందని తెలిపారు. వ్యాపారులు, ప్రజలకు మేలు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వెల్లడించారు. పరిశ్రమలకు భారీ రాయితీ ఇచ్చి..రైతులకు కూడా ఒక శాతం మేర రాయితీ కల్పించారు. ఆర్ధిక రాజధాని ముంబయ్ లో విద్యుత్ సరఫరా చేసే సంస్థలు అయిన అదానీ ఎనర్జీ, టాటా పవర్ లు 18 నుంచి 20 శాతం వరకూ టారిఫ్ లను తగ్గించాయి. వాణిజ్య సంస్థలకు ఇది 19-20 వరకూ ఉండబోతోంది. గృహ వినియోగదారులకు మాత్రం 10-11 శాతం ఉండనుంది.

ఈ టారిఫ్ ల తగ్గింపు ప్రతిపాదనలకు మహారాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ (ఎంఈఆర్ సీ) ఆమోదం తెలిపింది. గత పదిహేను సంవత్సరాల కాలంలో ఇలా టారిఫ్ ల్లో కోత పెట్టడం ఇదే మొదటిసారి అని తెలిపారు. కరోనా మహమ్మారి దేశాన్ని పీడిస్తున్న సమయంలో ఆర్ధిక కార్యకలాపాల వేగం పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్‌ఈఆర్‌సీ చైర్మన్‌ ఆనంద్‌ కులకర్ణి మాట్లాడుతూ.. అన్ని వర్గాలతో చర్చించిన తర్వాతే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని... దీని కారణంగా ఖజానాపై ఎటువంటి అదనపు భారం పడబోదని తెలిపారు. ఇక విద్యుత్‌ చార్జీలు తగ్గిన నేపథ్యంలో విద్యుత్‌ను దుర్వినియోగం చేయకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 

Similar News