వైసీపీ సర్కారుపై జనసేన తీవ్ర విమర్శలు చేసింది. కేవలం భూ దందాల కోసమే వైజాగ్ ను రాజధానిగా ఎంపిక చేశారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. వైసీపీకి మెజారిటీ ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వచ్చి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పిన వైసీపీ 22 ఎంపీలను ఇస్తే ఏమి చేస్తుందని ప్రశ్నించారు. కనీసం పార్లమెంట్ లో ప్రత్యేక హోదా గురించి మాట్లాడే ప్రయత్నం కూడా చేయటంలేదన్నారు. నాదెండ్ల మనోహర్ బుధవారం నాడు విశాఖపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం చేసిన తప్పులే వైసీపీ ప్రభుత్వం కూడా చేస్తోందని అన్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి... గ్రామ, మండల, పట్టణ స్థాయిలో ఫ్యాక్షన్ రాజకీయాలకే పరిమితమైందని విమర్శించారు. ప్రణాళిక లేని పాలన చేయడంతో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయిందన్న భావన ప్రతి ఒక్కరిలో వ్యక్తమవుతోందని చెప్పారు. వైసీపీ తొమ్మిది నెలల పాలనలో ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడం, రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్రాభివృద్ధిని రివర్స్ గేర్ లో తీసుకెళ్లడం తప్ప ఏమీ చేయలేదన్నారు.
ఉగాది నాటికి ఇంటి పట్టాల పంపిణీ పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, చివరకు ఆర్మీ జవాన్లకు ఇచ్చిన భూములును సైతం లాక్కొంటోంది. యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలి. విశాఖపట్నం మంచి ఐ.టి., టూరిజం హబ్ గా మారాలని ఇక్కడ ప్రజలు కోరుకుంటుంటే... నాయకులు చేసే ప్రకటనలు మాత్రం అయోమయం సృష్టించే విధంగా ఉన్నాయి. తమది సంక్షేమ ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకొటున్న వైసీపీ ప్రభుత్వం... గత ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ సమావేశాల్లో చెప్పిన పనుల్లో కేవలం 42 శాతమే పూర్తి చేసింది. రాష్ట్ర ఆదాయం దారుణంగా పడిపోయింది. పెట్టుబడులు పెట్టాలంటే వణికిపోయే పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన కంపెనీలను సైతం వెళ్లగొడుతున్నారు. రాజధాని చేస్తామన్న ప్రాంతంతో భావోద్వేగ అనుబంధం ఉండాలి తప్ప.. మూడు బిల్డింగులు కట్టి, ఉద్యోగులను తరలిస్తే రాజధాని అయిపోదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ ప్రాజెక్టులు నిలిచిపోయాయి. ఏజెన్సీలో వైద్యం అందని ద్రాక్షలా మరింది. కనీసం 10 మంది డాక్టర్లు ఉండాల్సిన ఆస్పత్రుల్లో ముగ్గురు కూడా లేరు. విభజన హామీ చట్టంలో భాగంగా ఈ ప్రాంతానికి రావాల్సిన సంస్థలను కూడా తీసుకురాలేకపోయారు.
రాష్ట్రానికి మేలు చేయడం కోసమే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నాం. రాష్ట్రానికి మేలు చేయాలంటే ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం తప్పకుండా అవసరమని నమ్ముతున్నామని తెలిపారు. రాబోయే అన్ని ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసే పోటీ చేస్తాయి. భవిష్యత్తులో తప్పకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న నమ్మకం ఉంది. భారతీయ జనతా పార్టీకి పార్లమెంటులో అద్భుతమైన మెజార్టీ ఉంది. ఆ పార్టీకి వైసీపీ అవసరం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆశీసులు తమకున్నాయని లేనిపోని విషయాలను వైసీపీ నాయకులు ప్రచారం చేసుకొంటున్నారు. ఏ కారణాలతో బీజేపీతో కలిసి పనిచేయాలనుకున్నామనే విషయాన్ని ప్రజాక్షేత్రంలోకి బలంగా తీసుకెళ్తాం. ఉగాది నుంచి ఇరు పార్టీలు కలిసి సమష్టిగా ప్రజాసమస్యలపై పోరాటం చేస్తాయి.
స్థానిక సంస్థల ఎన్నికలను ఇప్పుడున్న రిజర్వేషన్ల మేరకే నిర్వహిస్తామని చెప్పి వైసీపీ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోంది. ఈ విషయంలో మీ ఆర్డినెన్సులు, జి.ఒ. లు లీగల్ గా నిలబడవని మీకు తెలుసు. అయినా ప్రజల్ని మభ్యపెట్టారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ముఖ్యమంత్రి తన వైఖరి స్పష్టం చేయాలి. వైసీపీ ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్నారనేది ప్రజల అనుమానం. జనసేన కూడా అలాగే భావిస్తోంది. ఈ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాల్సిందే. 59 శాతం రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిందే. హైకోర్టు తీర్పు నేపథ్యంలో రిజర్వేషన్లు కుదించి ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రులు చెప్పడం వంచనే. కన్వీనియంట్ రాజకీయాలకు ఇది పరాకాష్ట” అన్నారు. ఈ సమావేశంలో జనసేన ప్రధాన కార్యదర్శులు టి.శివశంకర్, బొలిశెట్టి సత్య, పి.ఏ.సి. సభ్యులు కోన తాతారావు, ఉత్తరాంధ్ర సమన్వయ కమిటీ కన్వీనర్ సుందరపు విజయకుమార్ పాల్గొన్నారు.