అశోక్ గజపతిరాజు. సంచయితల వివాదం ముదురుతోంది. తొలిసారి ట్రస్ట్ వ్యవహారాలపై అశోక్ గజపతిరాజు శనివారం నాడు మీడియా ముందుకు రాగా..ఆయన వ్యాఖ్యలకు సంచయిత గజపతిరాజు కౌంటర్ ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. తాను ఎవరికీ భయపడబోనని, తానేంటో నిరూపించుకుంటానని సంచయిత వ్యాఖ్యానించారు. తాజాగా ఆమెను ఏపీ ప్రభుత్వం సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్‌పర్సన్‌గా, మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్(మాన్సాస్) ట్రస్ట్ చైర్‌పర్సన్ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. తన పనితీరు చూడకుండానే విమర్శలు చేయడం సరికాదని అన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మాన్సాస్ ట్రస్ట్ ను సమర్థవంతంగా నడిపిస్తానన్న నమ్మకాన్నివ్యక్తం చేశారు. చీకటి జీవోతో తాను పదవి దక్కించుకున్నానని టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. తన పట్ల టీడీపీ నాయకుల వ్యాఖ్యలు వివక్షాపూరితంగా ఉన్నాయన్నారు.
పురుషులతో సమానంగా పనిచేయగల సామర్థ్యం తనకు ఉందన్నారు. మాన్సాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థల్లో చదువుకుంటున్న వారిలో 60 శాతానికిపైగా బాలికలు ఉన్నారని వెల్లడించారు. మహిళలను తక్కువగా అంచనా వేయడం సరికాదని హితవు పలికారు. తాను హిందువుని కాదన్నట్టుగా తన బాబాయ్ అశోక్ గజపతిరాజు మాట్లాడటం పట్ల సంచయిత ఆవేదన చెందారు. బాబాయ్ ఇలా మాట్లాడతారని అసలు ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వాటికిన్ వెళ్లి ఫొటో దిగినంత మాత్రాన క్రిస్టియన్ అవుతానా? మీరెప్పుడూ మసీదులు, చర్చిలు, గురుద్వారాలకు వెళ్లలేదా? ఎన్నోసార్లు వెళ్లి మీరు ఫొటోలు కూడా తీయించుకున్నారు. అంతమాత్రన మీరు హిందువు కాకుండా పోయారా? మీలాగే నేను ఇతర మతాల ప్రార్థనాలయాలకు వెళ్లాను. మహిళగా నాకు ఈ అవకాశం రావడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. నేను హిందువును కాదంటూ నాపై కొందరు తప్పుడు ప్రచారం చేయడం దారుణం. సింహాచలం దేవస్థానాన్ని, మాన్సాస్ ట్రస్ట్‌ను రాజకీయంగా చూడొద్దు. నేను సేవ చేయడానికే వచ్చా. నాపై తప్పుడు ఆరోపణలు చేసే వారికి ఒకటే విజ్ఞప్తి. నా పనితీరును చూసి తీర్పు ఇవ్వండి. నాపై విమర్శలు చేసేవారికి పనితీరుతోనే సమాధానం ఇస్తా.’ అని పేర్కొన్నారు.