ఏపీలో ఎండలు ఓ వైపు...ఎండలను మించిన స్థానిక సంస్థల ఎన్నికల వేడి మరో వైపు. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో హైఓల్టేజ్ రాజకీయం నడుస్తోంది. ఈ తరుణంలో సడన్ గా ఎవరూ ఊహించని రీతిలో షాకింగ్ నిర్ణయం. ఉరుముల్లేని పిడుగులా వచ్చిపడింది. దీంతో ఏపీలోని పార్టీలన్నీ ఒక్కసారే షాక్ కు గురయ్యాయనే చెప్పాలి. ముఖ్యంగా అధికార వైసీపీకి ఇది ఊహించని షాక్. ఎందుకంటే ఫుల్ జోష్ లో ఉన్నది ఆ పార్టీనే. ఆరు వారాల తర్వాత ఎన్నికలు జరిగినా ఫలితాల్లో పెద్దగా మార్పులు ఉంటాయని ఎవరూ అనుకోరు. కానీ స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించి..కేంద్రం నుంచి రావాల్సిన మూడున్నర వేల కోట్ల రూపాయలను తెచ్చుకోవాలనే పట్టుదలతో ఉన్న సర్కారుకు ఇది పెద్ద దెబ్బగా మారినట్లే కన్పిస్తోంది. ఎన్నికలు వాయిదాపడినందున కేంద్రం ఇప్పుడు ఆ నిధులు ఇస్తుందా అంటే అనుమానమే అని చెబుతున్నారు. దీని కోసమే ఏకంగా బడ్జెట్ సమావేశాలను కూడా వాయిదా వేసుకున్నారు.
ఎన్నికల వాయిదాకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కరోనా వైరస్ నే కారణంగా చెబుతున్నా..దీని వెనక కేంద్రం జోక్యం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి బలం చేకూర్చే అంశాలు కూడా రమేష్ కుమార్ విలేకరుల సమావేశంలో వెల్లడించిన అంశాల్లో స్పష్టంగా కన్పిస్తున్నాయి. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో జరిగిన హింసాత్మక సంఘటనలపై రమేష్ కుమార్ ఇప్పుడు ఘాటుగా స్పందించటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పలు సంఘటనలు మీడియాలో ప్రముఖంగా వచ్చినా కూడా రమేష్ కుమార్ పెద్దగా స్పందించింది లేదు. కానీ ఇప్పుడు పలు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల బదిలీలకు ఆదేశాలు జారీ చేయటంతోపాటు పోలీసు అధికారులపై చర్యలకు సిద్ధం అవటంతోనే పైనుంచి ఒత్తిడి ఉందనే అనుమానాలు రాజకీయ పార్టీల్లో వ్యక్తం అవుతున్నాయి.
నిజానికి రమేష్ కుమార్ తీవ్రమైన అల్లర్లపై స్పందించదలచుకుంటే ఇఫ్పటికే స్పందించాల్సి ఉందని..కానీ సంఘటనలు జరిగిన ఇన్ని రోజుల తర్వాత ఆయన ఇఫ్పుడు స్పందించటంతోనే అనుమానాలు మరింత బలోపేతం అవుతున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఏపీలో కరోనా నియంత్రణకు సర్కారు పలు చర్యలు చేపట్టింది. అక్కడ ఇప్పటివరకూ నమోదు అయింది కూడా ఒక్క పాజిటివ్ కేసే. కానీ కరోనా వైరస్ కారణంగానే ఎన్నికలు వాయిదా వేశారు అంటే నమ్మటం అనుమానమే అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా ఏపీలో జరిగిన ఈ పరిణామం పెద్ద సంచలనంగా మారిందనే చెప్పాలి. కొద్ది రోజుల క్రితం బిజెపి ఎంపీలు జీవీఎల్, టీజీ వెంకటేష్, సీఎం రమేష్ లు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఏపీలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ఫిర్యాదు కూడా చేసిన సంగతి తెలిసిందే.