ఏబీ వెంకటేశ్వరరావు కు కేంద్రం షాక్

Update: 2020-03-07 11:15 GMT

కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్ లో) తన సస్పెన్షన్ అక్రమం అంటూ పోరాడుతున్న ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏ బీ వెంకటేశ్వరరావుకు కేంద్రం షాక్ ఇచ్చింది. వెంకటేశ్వరరావు అవినీతిపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయన్న కేంద్రం.. ఆయన సస్పెండ్‌ను సమర్థించింది. ఆయన అవినీతిపై ఏప్రిల్ 7లోగా చార్జ్‌షీట్‌ దాఖలు చేయాలని శనివారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. మొత్తం రూ. 25 కోట్ల 50 లక్షల పరికరాల కొనుగోలులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయనీ.. వీటి వెనుక వెంకటేశ్వరరావు హస్తం ఉందని హోంశాఖ పేర్కొంది. పోలీస్‌శాఖ అధునీకరణ పేరుతో ఆయన అవినీతికి పాల్పడ్డారని నిర్థారించింది.

ప్రవర్తనా నియమాల ఉల్లంఘించినందుకు ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గతనెల 8న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ (క్రమశిక్షణ, అప్పీల్‌) నిబంధనల నియమం 3 (1) కింద సస్పెండ్‌ చేసినట్లు ఆదేశాల్లో పేర్కొంది. ఏబీ వెంకటేశ్వరరావు అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌గా ఉండగా భద్రతా పరికరాల కొనుగోలు టెండర్లలో అవకతవకలకు పాల్పడినట్లు తేలటంతో సస్పెండ్‌ చేసినట్లు జీవో నంబర్‌ 18లో స్పష్టం చేశారు

 

Similar News