జగన్ ముందు వాటిపై దృష్టి పెట్టాలి

Update: 2020-02-06 08:59 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందు పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా అంశాలపై దృష్టి సారించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సూచించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. అయితే దేశంలో ఎక్కడా అసెంబ్లీ ఓ చోట, సచివాలయం మరో చోట లేవన్నారు. అయితే మూడు రాజధానులపై తాను ఏమీ చెప్పలేకపోతున్నానని వ్యాఖ్యానించారు. అమరావతి రైతులది త్యాగం కాదని, రియల్ ఎస్టేట్‌ భాగస్వామ్యమని ఎప్పుడో చెప్పానన్నారు. గత ప్రభుత్వం అగ్రిమెంట్‌ను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేస్తే ఎవరైనా వస్తారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం చెబుతున్నట్లు 2021 జూన్‌కు పోలవరం పూర్తయ్యేలా లేదని అన్నారు. మార్గదర్శి కేసుపై త్వరలో పుస్తకం తీసుకు వస్తానని ఉండవల్లి తెలిపారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ సంస్థ కేసులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్పీల్‌ చేయాల్సి ఉందన్నారు. డబ్బు సంపాదించుకున్న కులంలో మనం మాత్రమే బాగుపడాలనే ఆలోచన వస్తే అది మిగిలిన వారికి ఇబ్బంది కలిగిస్తుందన్నారు.

స్వతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఆంధ్ర ప్రాంతంలో 2270 మంది ఎమ్మెల్యేలుగా నెగ్గితే వారిలో 1144 మంది అంటే 50.39 శాతం రెడ్డి, కమ్మ కులాలకు చెందిన వ్యక్తులు ఉన్నారని పేర్కొన్నారు. కులాలకు సంబంధించి కూడా ఓ పుస్తకం రాస్తానని ఉండవల్లి తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలు మంచి నిర్ణయమని ప్రశంసించారు. మాజీ జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ సీఎంను కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. దీనిపై టీడీపీ ఆరోపణలు చేయడం దారుణమన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా..జగన్ లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నాడని చెప్పినా ప్రజలు అత్యధిక ఓట్లు వేసి వైఎస్సార్‌సీపీని గెలిపించారని ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ అన్నారు.

Similar News