ప్రతిపక్ష టీడీపీ నేతలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు చేశారు. తొలుత పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిపై దాడి చేశారు. తర్వాత ఎంపీ నందిగం సురేష్ పై..ఇప్పుడు తన వాహనాలను అడ్డుకున్నారని విమర్శించారు. ఇది రైతుల పనికాదని..టీడీపీ గుండాలే ఈ పనిచేశారని ఆరోపించారు. తనపై దాడికి చంద్రబాబు కుట్ర పన్నారని రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఆర్డీఏను ‘చంద్రబాబు రిలేషన్స్ దోపిడీ ఏజెన్సీ’గా మార్చారన్నారు. సీఆర్డీఏ పేరుతో పచ్చటి పొలాలను నాశనం చేశారని విమర్శించారు. 4 వేల ఎకరాలకు పైగా దోచుకున్నారన్నారు. ప్రజా రాజధాని పేరుతో ఓ సామాజిక వర్గానికి చెందిన రాజధాని కట్టారన్నారు.
చంద్రబాబును నమ్మి కుప్పం ప్రజలు నష్టపోయారన్నారు. ఓ ప్రాంతమే అభివృద్ధి చెందాలని ఎందుకు ఆలోచిస్తున్నారన్నారు. 13 జిల్లాల ప్రజలు పన్నులు కడుతున్నారని.. వాళ్లకు న్యాయం చేయాల్సిన అవసరం లేదా అన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే మూడు రాజధానులని.. ఎవరిపైనో కుట్రతోనో కాదన్నారు. ఎమ్మెల్యేలపై దాడులు చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇలాగే వ్యవహరిస్తే ప్రజాచైతన్యయాత్ర ఇంచు కూడా కదలకుండా చేస్తామన్నారు. చంద్రబాబు డ్రామాలు కట్టిపెట్టకుంటే తగిన శాస్తి జరుగుతుందని వ్యాఖ్యానించారు.