తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు కెసీఆర్ సర్కారు మరోసారి షాక్ ఇచ్చింది. అదిగో పీఆర్ సీ..ఇదిగో పీఆర్ సీ అంటూ ఊరిస్తూ ఏకంగా ఇప్పుడు పీఆర్ సీ కమిషన్ గడువునే 2020 డిసెంబర్ వరకూ పొడిగించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అంటే అప్పటి వరకూ తుది నివేదిక రాదు..పీఆర్సీ అమలు కాదు. మరి ఏమైనా మధ్యంతర ఊరట ఇస్తారా అనే అంశంపై కూడా స్పష్టత లేదు. కొద్ది రోజుల క్రితం సీఎం కెసీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులు పీఆర్సీపై చాలా ఆశలే పెట్టుకున్నారని..కానీ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని స్పష్టమైన సంకేతాలు ఇఛ్చారు. కాకపోతే ఎంతో కొంత ఇవ్వకతప్పదుగా అంటూ వ్యాఖ్యానించారు. కానీ ఇఫ్పుడు ఏకంగా పీఆర్సీ కమిషన్ గడువును డిసెంబర్ కు పెంచుతూ నిర్ణయం తీసుకోవటంతో షాక్ కు గురవటం ఉద్యోగుల వంతు అయింది.
ఎప్పటి నుంచో ఉధ్యోగులు పీఆర్సీ విషయంలో సర్కారు చేస్తున్న విపరీత జాప్యంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పదవి విరమణ చేసిన వారికి వచ్చే డబ్బు జారీ విషయంలో కూడా తీవ్ర జాప్యం చేస్తుండటంపై ఉద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు. కానీ ఎవరూ ఈ అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితిలో లేరు. అయితే ఈ పీఆర్ సీ జాప్యంపై వచ్చే వ్యతిరేకతను ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచటం ద్వారా కొంత అయినా తగ్గించుకునే పనిలో సర్కారు ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు ఎన్ని చేసినా మళ్ళీ ఎన్నికల నాటికి ఏదో ఒకటి చేసి ఉద్యోగులను తమ వైపు తిప్పుకోవచ్చనే వైఖరిలో కెసీఆర్ ఉన్నారని..ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో అది ప్రూవ్ కాలేదా? అని ఓ ఉద్యోగ సంఘాల నేత వ్యాఖ్యానించారు.