డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన ఖరారు

Update: 2020-02-11 04:50 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన ఖరారు అయింది. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో ట్రంప్ భారత్ లో పర్యటించనున్నట్లు శ్వేతసౌధం ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఢిల్లీ, అహ్మదాబాద్ ల్లో పర్యటించనున్నట్లు వైట్ హౌస్ మీడియా సెక్రటరీ స్టెఫానీ గ్రిషమ్ తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత భారత్ కు రావటం ఇదే తొలిసారి. భార్య మెలానియాతో కలసి ట్రంప్ భారత పర్యటనకు రానున్నారు. అమెరికా అధ్యక్షుడి భారత్ పర్యటనతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ పర్యటన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని నరేంద్రమోడీల మధ్య వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. గత కొంత కాలంగా అమెరికాతో వాణిజ్య అంశాలపై విభేదాలు తలెత్తాయి. అగ్రదేశాల మధ్య నెలకొన్న ఈ పరిణామాలు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తం అయ్యాయి.. దీంతో అమెరికా, చైనాలు కూడా దిగొచ్చి తొలి దశ ఒప్పందాలు చేసుకున్నాయి. ఇప్పుడు భారత్ తోనూ అమెరికా అదే తరహాలో ఒప్పందానికి రెడీ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Similar News