జగన్ ఢిల్లీ టూర్ అందుకే..!

Update: 2020-02-14 12:33 GMT

ఐటి దాడులకు సంబంధించి ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నాయి. ఏపీ మంత్రులు..వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు, నారా లోకేష్ టార్గెట్ గా విమర్శలు చేస్తుంటే...టీడీపీ నేతలు జగన్ ను టార్గెట్ చేశారు. జగన్ శుక్రవారం నాటి ఢిల్లీ పర్యటనపై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర ఆరోపణలు చేశారు. తన కేబినెట్ లోని ఎనిమిది మంత్రులు, ఎంపీలను ఐటి దాడుల నుంచి రక్షించుకునేందుకే జగన్ ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు. తెలంగాణ సీఎం కెసీఆర్ కుసంబంధించిన సంస్థలపై ఐటి దాడులు జరిగితే వైసీపీ నేతలు ఎందుకు నోరు మెదపలేదని ఉమా ప్రశ్నించారు. అవినీతిలో కూరుకుపోయిన జగన్ అందరికీ అవినీతి పూయాలని చూస్తున్నారని విమర్శించారు. వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో కేవలం రెండు లక్షల నగదు, 12 తులాల బంగారమే మాత్రమే ఐటి అధికారులు గుర్తించారని తెలిపారు.

సీఎం కేసీఆర్‌ సన్నిహితుల కంపెనీ ప్రతిమా ఇన్‌ఫ్రాలో ఐటీ సోదాలు చేశారని, మంత్రులు ఎందుకు ప్రతిమ పేరు ఎత్తడం లేదని ప్రశ్నించారు. ప్రతిమ పేరు ఎత్తితే కేసీఆర్‌ మీ తోకలు కత్తిరిస్తారని భయమా అని మరోసారి ప్రశ్నించారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో పోటీ లేకుండా..సీఎం జగన్‌ మేనమామ బినామీకి టెండర్‌ ఇచ్చారని ఉమా ఆరోపించారు. రాష్ట్రంలో నడుస్తున్న రెండు ప్రాజెక్ట్‌ లు జగన్‌ బంధువులవేనని తెలిపారు. షెల్‌ కంపెనీలకు ఆధ్యుడు ఎంపీ విజయసాయిరెడ్డేనని విమర్శించారు. ఏ ముఖ్యమంత్రి కొడుకైనా 16 నెలలు జైల్లో ఉన్నారా అని ప్రశ్నించారు. జగన్‌ సాకులు చెబుతూ కోర్టు వాయిదాలు తప్పించుకుని తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు.హడావుడిగా ఢిల్లీ పోయి హోం మంత్రి కాళ్లు పట్టుకోబోతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 

Similar News