గతంలో జరిగిన తప్పులు మరోసారి పునరావృతం కాకూడదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. పోలవరం పనులను పరుగులు పెట్టించాలన్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. తర్వాత అధికారులతో ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహించారు. 2021 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. గతంలో ప్రణాళికాలోపం, సమన్వయ లోపం, సమాచార లోపం ఏర్పడిందన్నారు. జూన్ నాటికి స్పిల్‌వే పనులు పూర్తికావాలని సూచించారు.
జూన్ కల్లా రైట్ మెయిన్ కెనాల్ కనెక్టివిటీ పూర్తవుతుందని అధికారులు చెప్పారు. కాపర్ డ్యాంలో ఇప్పుడున్న ఖాళీలు పూర్తిచేస్తే 41.15 మీటర్ల మేర నీటి నిల్వలు ఉన్నాయని, 17వేలకు పైగా కుటుంబాలను తరలించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. దేవీపట్నం మండలంలోని 6 గ్రామాలను తరలించాలని అధికారులు చెబుతున్నారు. రూపాయి ఎక్కువైనా సరే.. బాధితులను మానవతా కోణంలో చూడాలని జగన్ సూచించారు.