కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది. తొలి సారి ఏపీ రాజధానుల అంశంపై ఓ ప్రకటన చేసింది. లోక్ సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అడగిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఈ అంశంపై స్పష్టత ఇచ్చింది. రాజధానిపై నిర్ణయం రాష్ట్రాలదేనని కేంద్రం స్పష్టం చేసింది. 2015లో ఏపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నోటిఫై చేసిందని కేంద్రం తెలిపింది. 2015 ఏప్రిల్ 23న వెలువడిన ఉత్తర్వుల ప్రకారం అమరావతిని రాజధానిగా ప్రకటించారన్నారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారని మీడియాలోనే చూశామని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సమాధానం ఇచ్చింది. ఈ అంశంపై కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
ఏపీలో జగన్మోహన్ రెడ్డి సర్కారు కొలువుదీరిన తర్వాత అమరావతి పనులను నిలిపివేసి..తర్వాత మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చిన సంగతి తెలిసింది. అంతే కాదు..రెండు కమిటీ నివేదికల ఆధారంగా విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతిలో లెజిస్టేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లు కూడా ఆమోదం పొందింది. అయితే అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల ఆందోళనతో గత కొన్ని నెలలుగా ఏపీలో ఈ వివాదం నడుస్తూ ఉంది. ఈ తరుణంలో కేంద్రం ఇచ్చిన స్పష్టత అత్యంత కీలకంగా మారింది.