ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం నాడు విశాఖపట్నంలోని శారదా పీఠాన్ని సందర్శించారు. పీఠం వార్షికోత్సవాలకు ఆయన హాజరు అయ్యారు. సీఎం వైఎస్ జగన్ పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రల ఆశీస్సులు అందుకున్నారు. శారదా పీఠం ప్రాంగణంలోని రాజశ్యామల అమ్మవారికి ముఖ్యమంత్రి ప్రత్యేక పూజల చేశారు. పీఠాధిపతులతో కలిసి జమ్మిచెట్టు ప్రదక్షిణ చేసిన సీఎం వైఎస్ జగన్.. గోమాతకు నైవేద్యం సమర్పించారు. పీఠంలో నూతనంగా నిర్మించిన స్వయం జ్యోతి మండపం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఆగమ యాగశాలలో ఐదు రోజులుగా టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీనివాస చతుర్వేద హవనం పూర్ణాహుతిలో సీఎం వైఎస్ జగన్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు పాల్గొన్నారు. లోక కల్యాణార్థం విశాఖ శారదా పీఠం చేపట్టిన రాజశ్యామల యాగం పూర్ణాహుతికి సీఎం హారజయ్యారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యానంలో ముద్రించిన తత్త్వమసి గ్రంథాన్ని సీఎం స్వీకరించారు. శ్రౌత మహాసభలో ఉత్తమ పండితునికి సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా స్వర్ణకంకణధారణ చేశారు.