2024లో వచ్చేది జనసేన, బిజెపి ప్రభుత్వమే

Update: 2020-01-16 10:20 GMT

సస్పెన్స్ వీడింది, జనసేన, బిజెపిల మధ్య పొత్తు పొడిచింది. ఏపీలో జనసేన-బిజెపి కలసి మూడవ ప్రత్యామ్నాయంగా ఎదగనున్నట్లు ఇరు పార్టీల నేతలు సంయుక్తంగా ప్రకటించారు. గురువారం నాడు విజయవాడలో జనసేన, బిజెపి నేతల కీలక భేటీ జరిగింది. ఈ భేటీ అనంతరం ఇరు పార్టీల నేతలు సంయుక్త ప్రకటన చేశారు. ఈ సమావేశం అనంతరం కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్ కోసమే జనసేన బిజెపితో కలసి పనిచేయటానికి ముందుకొచ్చిందని అన్నారు. ఒక్క అవకాశం అంటూ వచ్చిన జగన్ రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టారని కన్నా ఆరోపించారు. ప్రజా సమస్యలపై కలసి పోరాడతామన్నారు. రాబోయే అన్ని ఎన్నికల్లో కలసి పోటీచేస్తామని స్పష్టం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఏపీకి బిజెపి అవసరం చాలా ఉంది. ఏపీ భవిష్యత్ కోసం బిజెపితో కలసి వెళ్తున్నాం. ప్రజా సమస్యలపై కలసి పోరాడతాం. ప్రజలు తృతీయ ప్రత్యామన్నాయం కోరుకుంటున్నారు. అదే బిజెపి, జనసేన కూటమి. స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లోనూ కలసి పోటీచేస్తాం. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉండటం వల్ల రాష్ట్రాలకు లాభం.

రెండు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. రాజధాని రైతులను జగన్ ప్రభుత్వం నిండా ముంచింది. ఇంత పెద్ద రాజధాని అవసరం లేదనే ఆనాడే చెప్పాను. రైతులకు టీడీపీ భరోసా ఇవ్వలేకపోయింది. 2024లో బిజెపి, జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. బిజెపి, జనసేన భావజాలం ఒక్కటే ’ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. జనసేన పీఏసీ నేత నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. బిజెపి రాజ్యసభ సభ్యడు, ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు మాట్లాడుతూ ‘ఏపీ రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక నిర్ణయం జరిగింది. రాష్ట్ర రాజకీయాలను ప్రక్షాళన చేయటంలో ఇది శుభపరిణామంగా చూస్తున్నాం. గత ఏడు నెలల్లో వైసీపీ, టీడీపీ నాయకులు కొంత మంది కేంద్ర ప్రభుత్వం, మోడీ, అమిత్ షాలు మా వైపు ఉన్నారని చెప్పుకుంటున్నారు.

ఎవరికి వారు పోటీదారులుగా నిలుస్తున్నారు. వారెవరికీ భారతీయ జనతా పార్టీతో రాజకీయ సంబంధాలు లేవు. కేవలం జనసేనతో బిజెపితో సంబంధాలు ఉన్నాయి. మేం ఇద్దరం కలసి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతాం. ఒక కొత్త కూటమి . పవన్ కళ్యాణ్ బిజెపితో కలసి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నుందుకు హృదయపూర్వంగా స్వాగతిస్తున్నాం. ఏపీలో కూడా అద్భుత రాజకీయ ఫలితాలు సృష్టించగలమని..ఈ కూటమిని ప్రజలు ఆధరిస్తారని భావిస్తున్నాం. కుల రాజకీయాలు, కక్ష పూరిత రాజకీయాలు పోవాలి. రెండు పార్టీలో చాలా ఉత్సాహంతో ప్రజాక్షేత్రంలో చాలా ఉత్సాహంగా నిలుస్తాయి. ’ అని వ్యాఖ్యానించారు. ఏపీ బిజెపి ఇన్ ఛార్జి సునీల్ దేవ్ ధర్ మాట్లాడుతూ తమ కూటమి వచ్చే ఎన్నికల్లో విజయాన్ని సాధిస్తుందని, బంగారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఏపీలో తమకు ఎవరితోనూ రహస్య స్నేహలు..బంధాలు లేవన్నారు. మంచి పాలన అందించటంలో జగన్, చంద్రబాబు విఫలమయ్యారని ఆరోపించారు.

 

Similar News