స్టిక్కర్ లేని వాహనాల్లో వచ్చిన తెలుగుదేశం ఎమ్మెల్సీలను అసెంబ్లీ సమీపంలోని ఫైర్ స్టేషన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. తమను అడ్డుకోవటంపై ఎమ్మెల్సీలు పోలీసులతో వాదనకు దిగారు. స్వయంగా సభ్యులమే వాహనాల్లో ఉన్నప్పుడు స్టిక్కర్లతో పనేంటని..తమను ఎలా ఆపుతారంటూ వాదనకు దిగారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఆ తరువాత ఎమ్మెల్సీల వాహనాలను పోలీసులు అనుమతినిచ్చారు. ఇప్పుడు అందరి దృష్టి కౌన్సిల్ వైపే ఉన్న విషయం తెలిసిందే. బుధవారం నాడు కౌన్సిల్ లో ప్రతిపాదిత రాజధాని వికేంద్రీకరణ, సీఆర్ డీఏ చట్టం రద్దు బిల్లులకు ఆమోదం లభిస్తుందా?. తిరస్కరణకు గురవుతాయా అన్న ఆసక్తి అందరిలో నెలకొంది.
మంగళవారం నాడు శాసనమండలిలో ప్రతిపక్ష టీడీపీ రూల్ 71తో బిల్లులకు తాత్కలికం బ్రేక్ వేయగలిగింది. బీజేపీ, పీడీఎస్ సభ్యులు కూడా జోక్యం చేసుకుని... బిల్లులను తీసుకోవాలని కోరారు. దీంతో మంగళవారం సాయంత్రం 6.21 గంటలకు చైర్మన్ బిల్లులను తీసుకున్నారు. టీడీపీ మాత్రం ఈ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపించాలని కోరుతోంది. దీంతో పాటు ఆయా బిల్లులకు సంబంధించి కొన్ని సవరణలు కూడా ప్రతిపాదిస్తోంది.