వైసీపీ ఎమ్మెల్యే కారుపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు

Update: 2020-01-07 07:53 GMT

అమరావతి కోసం రైతులు చేస్తున్న ఆందోళన తీవ్రరూపం దాలుస్తోంది. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ రైతులు ఆందోళన చేసే పరిసర ప్రాంతాలకు కూడా వెళ్లటంలేదు. ఎవరైనా ఆ దారిలో వచ్చినా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయానికి వెళ్ళటానికే భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసి పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అమరావతి జెఏసీ, టీడీపీలు మంగళవారం నాడు పలు ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు.జాతీయ రహదారుల దిగ్బందనంతోపాటు తమ ఆందోళనలను ఉధృతం చేశారు. గుంటూరులో రైతులు ఆందోళన చేస్తున్న సమయంలో అటుగా వెళుతున్న వైసీపీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి కారు ట్రాఫిక్ లో చిక్కుకుంది.

కారులో ఎమ్మెల్యే ఉండటంతో గుంటూరు జిల్లా చిన్న కాకాని వద్ద రైతులు అందరూ ఆయన కారును చుట్టుముట్టారు. సీఎం జగన్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతే కాకుండా ఎమ్మెల్యే భద్రతా సిబ్బందిపై దాడికి దిగారు. తర్వాత ఆయన కారుపై రాళ్ళ దాడికి దిగారు. దీంతో ఎమ్మెల్యే కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. రైతుల రాళ్ళు, కర్రలతో కారుపై దాడి చేశారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులకు కూడా ఆందోళన చేస్తున్న వారిని నియంత్రించటం కష్టంగా మారింది.ఎమ్మెల్యే కారుకు మరో కారు అడ్డం పెట్టి మరీ అమరావతి ఆందోళనకారులు దాడికి దిగారు.

 

Similar News