జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు మదమెక్కి మాట్లాడుతున్నారంటూ ఆరోపించారు. అరికాలి నుంచి పైదాకా మదమెక్కితే ఇలాంటి మాటలే వస్తాయి. మదాన్ని అణుచుకోండి. లేదంటే ప్రజలే అణచివేస్తారు అని వ్యాఖ్యానించారు. కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇటీవల జనసేన అధినేత పవన్ తోపాటు టీడీపీ నేతలపై అభ్యంతరకర భాష వాడటం, నిరసన తెలుపుతున్న జనసేన కార్యకర్తలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలు చోటుచేసుకున్న సమయంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ నేరుగా మంగళవారం నాడు కాకినాడకు చేరుకుని తొలుత వైసీపీ, జనసేన ఘర్షణలో గాయపడ్డ కార్యకర్తలను పరామర్శించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తోపాటు ఆ పార్టీ నేతలు పాల్గొన్నారు.
విలేకరుల సమావేశంలో పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలు చూస్తూ ఉంటే ఇలాంటి పాశవిక పాలన మరింత పేట్రేగిపోతుందన్నారు. ఇలాంటి వ్యక్తులు, చీడపురుగులను రాజకీయాల నుంచి వెలివేయాలని వ్యాఖ్యానించారు. ఇందుకు ప్రజలు, మీడియా సహాయ సహకారాలు అవసరం అన్నారు. వైసీపీ నేతలు రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నాం అని చెప్పుకుంటున్నారు కానీ..వీళ్లు పెడుతున్నది బూతు మాధ్యమం అంటూ ఎద్దేవా చేశారు. ఇలాంటి మాటలు మాట్లాడేవారికి ఓట్లు వేయబోమని ప్రజలు ప్రతి ఇంట్లో తీర్మానం చేసుకోవాలని పవన్ సూచించారు. వైసీపీ అధికారంలోకి వస్తే పాలెగాళ్ళ రాజ్యం, ఫ్యూడల్ వ్యవస్థ.. ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తారని తాను ముందు నుంచి చెబుతూనే ఉన్నానని..ప్రస్తుతం అదే జరుగుతోందని అన్నారు. అయితే అత్యంత శాంతియుతంగా ఉండే గోదావరి జిల్లాల ప్రజలు వీటిని ఏమాత్రం సహించబోరని హెచ్చరించారు. మమ్మల్ని బూతులు తిట్టి..మా కార్యకర్తలను కొట్టి..తిరిగి మాపైనే కేసులు పెడతారా? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పోలీసులు కూడా సరిగా వ్యవహరించటంలేదని..దాడి ఘటనకు సంబంధించిన పూర్తి వీడియో ఆధారాలతో గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.
తాము అన్నింటికి తెగించే భయటకు వచ్చామని..ఇలాంటి వాటికి భయపడబోమన్నారు. అధికారం శాశ్వతం కాదు అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ఈ సమాజంలో ప్రజా ప్రతినిధిగా ఉంటూ ఎవరూ ఉపయోగించకూడని భాష ఉపయోగిస్తూ, ఆడపడుచుల మీద దాడి చేయటాన్ని పవన్ కల్యాణ్ తప్పుపట్టారు. తమకు శాంతి,భద్రతల సమస్యలు సృష్టించటం ఎంత సేపు. బాధ్యత గల వ్యక్తులు కాబట్టే హుందాగా వ్యవహరిస్తున్నామన్నారు. ‘మా సహనం చేతకాని తనం కాదు. బలం ఉండి మాట్లాడుతున్నాం. బలం ఉన్న వాళ్ళం కాబట్టే భరిస్తున్నాం. మేం అనుకుంటే .మీరెవరూ ఉండలేరు. నిరసన తెలిపే హక్కులు కూడా లేవా?.’ అని ప్రశ్నించారు.
తూర్పు గోదావరి జిల్లా ఎపుడూ ఇలాంటి భాష కాని..ఇలాంటి ప్రజాప్రతినిధులను కూడా చూడలేదన్నారు. ఘటనకు బాధ్యులైన వారిని పోలీసులు సుమోటోగా కేసు పెట్టాల్సింది. ఎమ్మెల్యేపైన కూడా చర్యలు తీసుకోవాల్సింది. అది పెట్టకుండా నిరసన కార్యక్రమం చేపడితే మాకు హక్కులు లేవంటారా? 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏమైనా పై నుంచి దిగొచ్చారా? నా సంస్కారం..నా మాట ఇంకా నియంత్రణలో ఉన్నాయి. పోలీసుల శాఖకు, రాష్ట్రాన్ని నడుపుడుతున్న వ్యక్తులుకు చెబుతున్నా..ఇంకొక్క సంఘటన జరిగితే..మా వాళ్ళ మీద చేస్తే చేతులు కట్టుకుని కూర్చోం అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.