విభేదాలు వాస్తవమే..చిరంజీవే ముందుండి నడిపించాలి

Update: 2020-01-02 09:37 GMT

‘మా’ నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ రసాభాసగా మారింది. హీరో రాజశేఖర్ తీరును చిరంజీవి, మోహన్ బాబు, కృష్ణంరాజులు తప్పుపట్టారు. అంతే కాదు చిరంజీవి అయితే ఏకంగా రాజశేఖర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణా సంఘానికి సూచించారు. ఈ తరుణంలో జీవితా రాజశేఖర్ మాట్లాడారు. ‘మా’లోని విభేదాలు తగ్గించి..పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. నరేశ్‌ వర్గంతో తమకున్న విభేదాలను తామలో తాము పరిష్కరించుకుంటామని ఆమె తెలిపారు. మాలో భేదాభిప్రాయాలు ఉన్నమాట వాస్తవమేనని, వాటిని ఉమ్మడిగా పరిష్కరించుకుంటామని తెలిపారు. ప్రతిచోట గొడవలు రావడం సహజమేనని, తామేమీ దేవుళ్లం కాదు మీలాగే మనుషులమని అన్నారు. చిరంజీవి మా అసోసియేషన్‌కు చాలా టైమ్‌ ఇచ్చారని, మా అభివృద్ధికి ఎన్నో సూచనలు ఇచ్చారని తెలిపారు.

చిరంజీవి, మోహన్‌బాబులాంటి వారినుంచి ఎంతో నేర్చుకున్నామన్నారు. రాజశేఖర్‌ది చిన్నపిల్లల మనస్తత్వమని, ఆయన కొంచెం ఎమోషనల్‌గా ఫీల్‌ అయ్యారని, ఆయన మనస్సులో ఏది దాచుకోరని తెలిపారు. మా ను బలోపేతం చేయడం, గౌరవప్రదమైన సంస్థగా మార్చడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. నరేశ్‌తో తనకు కానీ, రాజశేఖర్‌కుకానీ వ్యక్తిగత విభేదాలు లేవని, చిన్నచిన్న భేదాభిప్రాయాలను అందరం కలిసి ఉమ్మడిగా పరిష్కరించుకుంటామని చెప్పారు. మరోవైపు సినీ పెద్దలు కూడా ‘మా’లోని విభేదాలను రూపుమాపి.. నరేశ్‌, జీవితారాజశేఖర్‌ వర్గాల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. దీంతో మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం వివాదంతో రచ్చరేపినా.. చివరకు పరిస్థితి చల్లబడింది. రాజశేఖర్ తీరుకు ఆమె విచారం వ్యక్తం చేశారు.

 

Similar News