తప్పుడు ప్రచారంపై పరువు నష్టం దావా

Update: 2020-01-25 11:18 GMT

పవన్ కళ్యాణ్ కు ఏపీ రాజధాని ప్రాంతంలో 62 ఎకరాల భూమి ఉందని..అందుకే ఆయన అమరావతికి మద్దతుగా ఉద్యమం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై జనసేన తీవ్రంగా స్పందించింది. ఈ ప్రచారానికి పాల్పడ్డ వారిపై పరువు నష్టం దావా వేయనున్నట్లు ప్రకటించింది. జనసేనను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక నీచ బుద్ధితో బురద చల్లడానికి కొందరు ప్రజా వ్యతిరేకులు కుట్రలు పన్ని తమ అనుచరగణంతో ఇలాంటి ప్రచారాలను తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని జనసేన చేస్తున్న ప్రజా పోరాటానికి కోట్లాది గొంతులు తోడు ఉండటంతో.. ఎదురొడ్డి పోరాడలేని అల్పబుద్ధి గల వాళ్ళే ఇలాంటి పనులు చేస్తున్నారని మండిపడ్డారు.

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు అమరావతి ప్రాంతంలో 62 ఎకరాల భూములు ఉన్నాయని, తప్పుడు పత్రాలు సృష్టించి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇలా ప్రచారం చేస్తున్నవారిపైనా, సోషల్ మీడియాలో వక్ర రాతలు రాస్తున్నవారిపైనా న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన లీగల్ విభాగం నిర్ణయించింది. ఈ ప్రచారానికి కారకులైన వారిపై పరువు నష్టం దావా వేయనున్నాము. ఒకటి రెండు రోజులలో వారందరికీ లీగల్ నోటీసులు పంపుతామని ఓ ప్రకటనలో తెలిపారు.

 

Similar News